నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
వైద్యాధికారులతో సమావేశం
నిర్మల్‌టౌన్, మార్చి 16 : ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ప్రసూతి కోసం వచ్చిన గర్భిణులకు సాధారణ ప్రసవాలు నిర్వహించి రాష్ట్రంలోనే నిర్మల్‌జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాంతీయ, సామాజిక దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో ఆపరేషన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పె ట్టాలని తెలిపారు. ప్రజల్లోనూ సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీల్లో 80శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని, అది తల్లీబిడ్డలకు అన్ని విధాలా ఆరోగ్యకరమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, వైద్యు లు దేవేందర్‌రెడ్డి, రజిని, సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకు సేవలను విస్తృత పరచాలి..
జిల్లాలో బ్యాంకు సేవలను మరింత విస్తృత పరిచి అర్హులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు నిర్దేశించిన రుణ లక్ష్యం, ఇచ్చిన రుణాలు, ఇవ్వాల్సినవి శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు మరింత ముందుకు రావాలని కోరారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
అటవీశాఖ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం..
జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలపై అటవీ, రెవెన్యూశాఖ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, అటవీ భూముల సర్వే వివరాలు, వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు కల్పించేందుకు రెండు శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. హరితనిధి, తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో అటవీశాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అధికారి వికాస్ మీనా అధికారులకు వివరించారు. జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.