నేటి నుంచి ఏడో విడుత కార్యక్రమం
12-14 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్
అన్ని పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో కేంద్రాలు
చిన్నారులకు ‘కార్బివాక్స్’
నిర్మల్ అర్బన్/ఎదులాపురం, మార్చి 15 : కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూనే, వ్యాక్సినేషన్‌నూ వేగవంతం చేసి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో రాష్ట్రం కొవిడ్ భయాందోళనల నుంచి బయటపడింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు దశల్లో టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా అందించారు. మూడో దశలో 60 ఏళ్లపై బడిన వారికి, నాలుగో దశలో 18-నుంచి 44 ఏళ్ల వారికి, ఐదో దశలో 45-59 ఏళ్ల వారికి, ఆరో దశలో 15-18 ఏళ్ల వారికి దశల వారీగా టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో మొదటి, రెండో దశ టీకాలను పూర్తి చేసి బూస్టర్ డోస్ సైతం అందించింది. ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మొదటి డోసు టీకాలు, 60 లక్షల రెండో డోసు టీకాలు, 20 వేల బూస్టర్ డోసు టీకాలు పూర్తయ్యాయి.
నేటి నుంచి ఏడో విడుత..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు దశలుగా కొవిడ్ టీకాలు అందించింది. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏడో విడత ప్రారంభం కానుంది. ఏడో విడుతలో 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు అందించనున్నారు. వీరికి ప్రత్యేకంగా కార్బివాక్స్ టీకాను అందించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 35650, నిర్మల్ జిల్లాలో 36వేలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 26802 మంది, మంచిర్యాల జిల్లాలో 37 వేల మంది 12-14 ఏళ్ల లోపు వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ టీకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలతో పాటు యూపీహెచ్‌సీల్లో టీకాలు అందించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అర్హులందరూ టీకాలు తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించడం తో పాటు అర్హులైన వారందరూ టీకాలు తీసుకోవాలి. ఈ నెల 16 నుంచి 12ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు వారందరికి టీకాలు అందిస్తాం. అన్ని పీహెచ్‌సీలతో పాటు యూపీహెచ్‌సీల్లో టీకాలు అందుబాటులో ఉంచాం. సద్వినియోగం చేసుకోవాలి.
– ధన్‌రాజ్, నిర్మల్ డీఎంహెచ్‌వో