నిర్మల్ టౌన్, మార్చి 15 : భూగర్భజలాల పరిరక్షణ అందరి బాధ్యత అని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ కలెక్టర్ సీ రాంబాబు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గ్రౌండ్ వాటర్ మెథడాలజీ -2015 పుస్తకాన్ని మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడారు. జిల్లాలో భూగర్భజలాలు పెరగడం హర్షనీయమని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిర్మల్ జిల్లా నిలిచినట్లు తెలిపారు. జిల్లా విస్తీర్ణం 3628 చదరపు కిలోమీటర్లు కాగా.. అందులో 362829 హెక్టార్లు భూగర్భజలం ఉందన్నారు. జిల్లాలో 19 మండలాలు, 16 గ్రౌండ్ వాటర్ బేషన్లను ఏర్పాటు చేసి భూగర్భజలాలను లెక్కించినట్లు తెలిపారు. భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో భూగర్భ జలశాఖ అధికారులు శ్రీనివాస్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి
జిల్లాలో రూ. 27 కోట్లతో ఈజీఎస్‌లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని 396 పంచాయతీల పరిధిలో రూ. 27 కోట్లతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండలాల వారీగా మంజూరైన సీసీ రోడ్లు, నిర్మాణంలో ఉన్నవి, పూర్తయిన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించేలా మండలాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధకారి వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, శంకరయ్య పాల్గొన్నారు.