డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
తాంసి సహకార సంఘం సర్వసభ్య సమావేశం
తాంసి, మార్చి 15: వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఏడీసీసీలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 43 బ్యాంకులు, 77 సొసైటీల్లో 1300 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్లు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని అన్నారు. చిరు వ్యాపారులకు రూ. లక్ష నుంచి 1.50 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బేల ఏడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిలో బాధ్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకొని రూ.1 కోటి రికవరీ చేశామని, మిగతావి కూడా రికవరీ చేస్తామని అన్నారు. ఈ నెల 25వ తేదీలోగా అన్ని బ్రాంచిల్లో, సొసైటీల్లో అడిట్ పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మరో 47 బ్రాంచిల్లో గోల్డ్‌లోన్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సూచించారు. సమావేశంలో సీఈవో కేశవ్, సొసైటీ వైస్ చైర్మన్ ధనుంజయ్, డైరెక్టర్లు అశోక్‌రెడ్డి, చంద్రన్న, రమేశ్, బుజ్జన్న పాల్గొన్నారు.
పరామర్శ
వడ్డాడి గ్రామానికి చెందిన కాడి లింగన్న భార్య, పొన్నారి గ్రామానికి చెందిన సంపత్‌రెడ్డి ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను డీసీసీబీ చైర్మన్ పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమణ, వైస్‌ఎంపీపీ రఘు, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.