అసెంబ్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, మార్చి 15: రాష్ట్రంలోని మూడో స్పోర్ట్స్ స్కూల్‌ను గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారని , దీనిని డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేస్తే క్రీడాకారులకు మరింత మేలు కలుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో స్పోర్ట్స్ స్కూల్ అప్‌గ్రేడ్ విషయమపై ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. ఇక్కడ ఇంటర్ వరకు చదువుకున్న క్రీడాకారులు డిగ్రీ లేక పోతే ఆటలకు స్వస్తి చెప్పే పరిస్థితి నెలకొంటుందన్నారు. స్పోర్ట్స్ హాస్టల్లో గిరిజన క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, వారు ఇప్పుడిప్పుడే పతకాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో డిగ్రీ వరకు పొడిగిస్తే ఇక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యే స్పోర్ట్స్ స్కూల్‌పై అసెంబ్లీలో మాట్లాడడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.