నిర్మల్ టౌన్, మార్చి 15: పేదలకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపికకు నిర్మల్ కలెక్టరేట్లో సాంఘిక అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్కీడ్రా నిర్వహించారు. డ్రాలో వడ్లూరి ఆయుష్ ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారి రాజేశ్వర్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ హన్మాండ్లు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎదులాపురం,మార్చి15: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గాను ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థిని ఎంపిక చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదిలాబాద్ కల్టెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన లక్కీ డ్రాలో గుడిహత్నూర్ మండలం కమలాపూర్‌కు చెందిన విద్యార్థిని దేవాన్షి ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, సిబ్బంది ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.