ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
పాఠశాలల సందర్శన
ఆదిలాబాద్ రూరల్, మార్చి 14: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియళ్లు, కేజీబీవీల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులకు సూచించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం సదర్శించారు. కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించారు. వంట ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు బండారి సతీశ్, పండ్ల శ్రీనివాస్, నాయకుడు వాఘ్మారే శైలేందర్, ప్రిన్సిపాల్ ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.
జైనథ్, మార్చి 14: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవీందర్ పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం లస్మన్న, ఎండీఎం ఇన్చార్జి సురేశ్ ఉన్నారు.
బేల, మార్చి 14 : మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలను తహసీల్దార్ బడాల రాంరెడ్డి సందర్శించారు. విద్యార్థులకు అందించే మధ్యహ్న భోజనం తో పాటు మంచినీటిపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం జ్యోతిరాం ఉన్నారు. చంద్పెళ్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ చందర్షావ్ పరిశీలించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు ఉన్నారు.
నేరడిగొండ, మార్చి 14: మండలంలోని మినీ గురుకులం, గుత్పాల టీడబ్ల్యూపీఎస్, కొర్టికల్ ఏహెచ్ఎస్, కొర్టికల్ ఎంపీపీఎస్, ధన్నూర్డి పాఠశాలలను ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. శానిటేషన్ రిజిస్టర్, స్టాక్, ఎండీఎం రిజిస్టర్ అందుబాటులో ఉంచాలన్నారు. సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ వారం నుంచి ప్రతి పాఠశాలను సందర్శిస్తారని చెప్పారు. అందరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట సీఆర్పీ వినోద్ ఉన్నారు.
ఇచ్చోడ, మార్చి 14 : మండలంలోని మేడిగూడ, ఇచ్చోడలోని కేజీబీవీ బాలికలు, మహాత్మా జ్యోతిబా పూలే ప్రభుత్వ వసతి గృహాలను తహసీల్దార్ అతిఖొద్దీన్, ఇతర అధికారులు సందర్శించారు. విద్యార్థులకు వండిపెడుతున్న భోజనంతో పాటు కూరగాయాలు, ఇతర పదార్థాలను పరిశీలించి, ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌కు పలు సూచలు చేశారు. హాస్టళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. వారి వెంట డిప్యూటీ తహసీల్దార్ జాధవ్ రామారావ్, వైద్యాధికారి ఆకుదారి సాగర్, హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాస్, జాదవ్ సుభాష్, ఉత్తం సింగ్, ఆయా వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు ఉన్నారు.
భీంపూర్, మార్చి14: అందర్‌బంద్ ఆశ్రమోన్నత పాఠశాలను తహసీల్దార్ మహేంద్రనాథ్ సందర్శించారు. వంటశాల, భోజనాన్ని పరిశీలించారు. హెచ్ఎం,ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ పెండెపు కృష్ణయాదవ్, హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు ఉన్నారు.
నార్నూర్,మార్చి14: గాదిగూడ మండలం ఝరి ఆశ్రమోన్నత బాలుర పాఠశాలను ఎంపీవో షేక్ ఖలీం హైమద్ సోమవారం సందర్శించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరుశాతం, మరుగుదొడ్ల వినియోగం,పాఠశాల పరిసరాలు, సరుకుల సరఫరా, విద్యార్థుల ఆరోగ్యం, బోధన తీరు, భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల స్థితిగతులను కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారు. వంటగదిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్ఎం మడావి జంగు, పంచాయతీ కార్యదర్శి సునీల్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
సిరికొండ,మార్చి14: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తహసీల్దార్ సర్ఫరాజ్ నవాబ్ సూచించారు. మండల కేంద్రంలో ఆశ్రమోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం,స్టోర్ రూంలో సరుకుల నిల్వలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకేకు ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించినట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్ఐ యుజ్వేందర్ రెడ్డి, ఉపాధాయులు ఉన్నారు.