నిర్మల్ అర్బన్, మార్చి14 : ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం అమలు విప్లవాత్మక నిర్ణయమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమ వారం శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని డీఈవో కార్యాలయంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆంగ్ల విద్యతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు ఏర్పడుతాయన్నారు. భవిష్యత్ తరాలకు మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్, ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి దోహదపడుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు సలోమీ కరుణ, రాజేశ్వర్, నారాయణ, ప్రవీణ్, రవి గౌడ్, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.