ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పన్నుల వసూలు
మొండి బకాయిల కోసం స్పెషల్ డ్రైవ్
ఈనెల 31 వరకు చెల్లింపునకు చాన్స్
బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ
చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక
నిర్మల్ అర్బన్, మార్చి 13 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. మార్చి 31 వరకు గడువు ముగుస్తుండడంతో పన్నుల వసూలుపై అధికారులు దృష్టిసారించారు. వంద శాతం పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆటోల ద్వారా ప్రచారం చేయడం, ఇంటింటికీ సిబ్బంది తిరుగుతూ అవగాహన కల్పించడం చేస్తున్నారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తుండగా.. చెల్లించని వారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.45.51 కోట్లు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 24.58 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.20.93 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 మున్సిపాలిటీలున్నాయి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లి.. నిర్మల్ పరిధిలో నిర్మల్, భైంసా, ఖానాపూర్.. ఆదిలాబాద్ పరిధిలో ఆదిలాబాద్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో కాగజ్‌నగర్ బల్దియాలు కలవు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 వరకు పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు కూడా చేపట్టింది. వంద శాతం లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టింది. సిబ్బంది కూడా ఇంటింటికీ తిరుగుతూ పన్నులు కట్టాలని చెబుతున్నారు. ఆటోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా కొన్ని బల్దియాల్లో అధిక మొత్తంలో, కొన్నింటిలో తక్కువగా వసూలయ్యాయి. చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తూ.. ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కార్యాలయానికి వచ్చి పన్నులు చెల్లించని వారికి వాట్సాప్ ద్వారా చెల్లించే సదుపాయంతోపాటు ఇంటికి వచ్చిన అధికారులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మొండిబకాయిదారులపై ప్రత్యేక చర్యలు
దీర్ఘకాలికంగా ఆస్తిపన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయిదారులపై అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఏండ్ల తరబడి కనీసం మూడేండ్లు, అంతకంటే ఎక్కువ కాలం చెల్లించకుండా ఉన్న వ్యక్తుల జాబితాను అధికారులు తయారు చేసి వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశారు.