ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. శాసనసభా వేదికగా 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లు కూడా వెలువడనుండగా.. ఉద్యోగార్థుల్లో నూతనోత్సాహం మొదలైంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. కోచింగ్ బాట పడుతుండగా.. సీనియర్ల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారు. బుక్స్ సేకరణలో నిమగ్నమవగా.. బుక్‌స్టాల్స్, లైబ్రరీలు కోలాహలంగా మారాయి. కొంచెం కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే కొలువు కచ్చితంగా కొట్టవచ్చని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఉద్యోగం సాధిస్తా..
నా పేరు ఎం శేఖర్. మాది భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామం. నేను అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న. వ్యవసాయ రంగానికి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన్రు. రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతి నేపథ్యంలో ఏఈవో, ఏవోల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని అంటున్నరు. రైతు బిడ్డనయిన నాకు వ్యవసాయ శాఖలో ఉద్యోగం అంటే చాలా ఇష్టం. తెలంగాణ చరిత్రతో పాటు ,ప్రస్తుత వ్యవసాయ సాగు విధానా లు, పంటల స్థితిగతులపై నోట్స్ సిద్ధం చేసుకుంటున్న. ఈసారి వచ్చిన నోటిఫికేషన్ల అవకాశం వినియోగించుకోవాలని పట్టుదలతో ఉన్న. కొన్నాళ్లు సెలవు పెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లాలనుకుంటున్న.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు.. 2004 జూన్ 5 నాటికి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మందిని రెగ్యూలరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండడంతో విద్యార్థుల్లో జోష్ నెలకొన్నది. సర్కారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు నిలిపివేసి, సర్కారు కొలువు కొట్టేందుకు ప్రిపేర్ కావడానికి సిద్ధమవుతున్నారు. తమకు కావాల్సిన మెటీరియల్ బుక్స్‌ను సేకరించడంలో నిమగ్నమయ్యారు.
దీంతో బుక్‌స్టాల్స్ సందడిగా మారాయి. తమకు అర్హత కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్‌ను చదవడంతోపాటు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి ఎస్సీ, బీసీ, ఇతర స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కోచింగ్ తీసుకున్న చాలా మంది ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో చేరడానికి ఉద్యోగార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు ఇప్పటికే రెండు,మూడు ఉద్యోగాలు సాధించిన వారి నుంచి ప్రిపరేషన్‌పై సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోచింగ్ సెంటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో యువతీయువకులు హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,919 ఉద్యోగాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,919 ఉద్యోగాలు లభించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో 1,193, నిర్మల్‌లో 876 , కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 825, మంచిర్యాలలో 1,025 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోకి వచ్చే బాసర జోన్లో 2,328, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోకి వచ్చే కాళేశ్వరం జోన్లో 1,630, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోన్-1లో 6,800 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. నియమకాల్లో భాగంగా జోనల్ విధానాన్ని అమలు చేయనుండడంతో స్థానికులకే అటెండర్ నుంచి ఆర్డీవో వరకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. దీంతో స్థానిక యువత ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలు చేసిన తర్వాత విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఇవ్వనుంది. ఫలితంగా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఎలా సన్నద్ధం కావాలో నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది.
టీచర్ కావాలనుకుంటున్న..
నేను ఎమ్మెస్సీ బీఈడీ చదివిన. సీఎం కేసీఆర్ సారు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తమని చెప్పడంతో చాలా సంతోషమనిపించింది. టీచర్ కావాలనుకుంటున్న. ఇప్పటికే ప్రిపేరవుతున్న. ఇక మరింత ఉత్సాహం తో చదువుత. పుట్టినూరు భీంపూర్ మండలం నిపానిలో కరోనా సమయంలో పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిన. ఇపుడు బీసీ స్టడీ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకొని కోచింగ్ వెళ్లాలనుకుంటున్న. ఈ లోపు అవసరమైన పుస్తకాలు చదువుతూ నోట్స్ రాసుకుం టున్న. ‘నమస్తే తెలంగాణ’ నిపుణ ప్రతి వారం చదువుతున్న. పేద, మధ్య తరగతి అభ్యర్థుల కోసం ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కూడా ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన్రు. ఈసారి కోచింగ్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించాలని నిశ్చయించుకున్న. పోస్టులు భర్తీ చేస్తమని చెప్పిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-లాయర్ రవళి, కేరిగామ, జైనథ్ మండలం
హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకుంట..
నేను బీటెక్ పూర్తి చేసిన. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికే షన్ విడుదల చేస్తమని చెప్పడంతో, పూర్తిస్థాయిలో ప్రిపేర్ కావాలని అనుకుం టున్న. బ్యాంకు ఉద్యోగానికి ప్రేపేరవుత. హైదరాబాద్‌కు పోయి కోచింగ్ తీసుకుం ట. పేరున్న ప్రైవేటు కోచింగ్ సెంటర్ కోసం స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్న. కరెంట్ అఫైర్స్కోసం రెండు తెలుగు, రెండు ఇంగ్లిష్ పేపర్లు చదువుతున్న. ఇప్పటికే అనుభవమున్న సీనియర్ల సలహాలు తీసుకున్న. సమయం వృథా చేయకుండా ఈ వారం లోనే హైదరాబాద్‌కు పోవాలనుకుంటున్న. కచ్చితంగా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న. – ఏ.రాజు, బీటెక్, డోప్టాల, బేల
సొంతంగా ప్రిపేరవుత..
నా పేరు మాద రాకేశ్ యాదవ్. మాది భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ మాది. నేను డిగ్రీ తరువాత జీపీ కార్యదర్శి ఉద్యోగానికి పరీక్ష రాసిన. అందులో ఎంపిక కాలే. అయినా నిరుత్సాహ పడకుండా నిత్యం ప్రిపేరవుతున్న. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న. సీఎం కేసీఆర్ సార్ ఏకకాలంలో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నమస్తే తెలంగాణ నిపుణతో పాటు తాజా అంశాల కోసం ఇంగ్లిష్ పేపర్లు చూస్తున్న. తెలంగాణ చరిత్ర,ముఖ్య ఘట్టాలపై పునశ్చరణ చేసుకుంటున్న. అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటూ ప్రశాంతంగా, ప్రణాళికా బద్ధంగా పరీక్షలకు సిద్ధమవుతున్న. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం.