ఎదులాపురం,మార్చి12: పెండింగ్ కేసుల రాజీతో ఇరువర్గాలకూ న్యాయం చేకూరుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు కార్యక్రమం కొనసాగింది. కోర్టులో కక్షిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందుగా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో10,107 కేసులు పరిష్కారమయ్యాయి. కేసులు పరిష్కరించడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని తెలిపారు. న్యాయమూర్తులు టీ. శ్రీనివాసరావు, జే మైత్రేయి, జీ ఉదయ్‌భాస్కర్ రావు, ఎస్ మంజుల, యశ్వంత్ సింగ్ చౌహాన్, క్షమాదేశ్ పాండే, పీపీలు ఎం.రమణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కిరణ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ వైరాగ్రె, న్యాయవాదులు, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, బ్యాంక్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, తదితరులున్నారు.
బాధితురాలికి రూ.8.75 లక్షలు:రోడ్డు ప్రమాదం కేసు పరిష్కారం
ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడకు చెందిన జవాడే రాంచందర్ ప్రైవేట్ డ్రైవర్. 2020లో వాంకిడి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ కేసులో వాదోపవాదాలు కోర్టులో కొనసాగుతున్నాయి. కాగా, ఇరువురు తమ సమస్య పరిష్కరించాలని జాతీయ లోక్ అదాలత్‌లో విజ్ఞాపన చేసుకున్నారు. ఈమేరకు శనివారం రాంచందర్ భార్య లక్ష్మికి ఎంఎస్ చోళ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, బాధితుల తరఫున న్యాయవాది కే. సంజయ్ కుమార్ రెడ్డి, ఇన్సూరెన్స్ ప్రతినిధుల తరఫున న్యాయవాది సంజయ్ కుమార్ వైరాగ్రే కలిసి పరస్పర అంగీకారానికి వచ్చారు. క్లెయిమ్ ప్రకారం బాధితులకు రూ.8.75 లక్షల పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీవారు అంగీకరించారు. ఈ నిర్ణయం తమకు అంగీకారమే అని బాధితులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత ముందు ఒప్పుకోవడంతో కేసు పరిష్కారమైంది. ఈ కేసులో బాధితులు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తంచేశారు.
లోక్ అదాలత్‌లోనే కేసు పరిష్కారమైంది..
నా పేరు లక్ష్మన్న. 2018లో నాకు యాక్సిడెంట్ అయ్యింది. నిర్మల్ జిల్లా వైఎస్సార్ కాలనీలో మేస్త్రీ పని చేసుకొ ని ఇంటికి వెళ్తుండగా అతివేగంగా వచ్చిన బోలెరో వాహనం ఢీకొంది. దీంతో నా రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నాకు పరిహారం ఇప్పించాలని కోర్టు చుట్టూ తిరుగుతున్న. లోక్ అదాలత్‌లో కేసు పరిష్కరించుకుందామని మా న్యాయవాది చెప్పిన్రు. అందుకే ఇక్కడికి వచ్చిన. కేసు పరిష్కారమైంది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.3లక్షల చెక్కు ఇచ్చిన్రు.