ఊరూరా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలను సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆదిలాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆటపాటలతో సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. పలుచోట్ల ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. పురుషులతో సమానంగా రాణించాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తానీషా గార్డెన్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ రెండు చోట్ల కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, ఎన్జీవో సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యం వేడుకలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో ఏర్పాటు చేసిన మహానీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. నార్నూర్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు.