కలెక్టర్ సిక్తా పట్నాయక్
అరణ్య గ్రామీణ కళామేళా ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎదులాపురం,మార్చి8: ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరణ్య గ్రామీణ కళామేళా ఎగ్జిబిషన్‌ను ఆదిలాబాద్ బోథ్ ఎమ్మెల్యే లు జోగురామన్న, రాథోడ్ బాపురావ్‌తో కలిసి ప్రారంభించారు.మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. మహిళలందరికీ శుభాకంక్షాలు తెలిపారు. నాబార్డు ద్వారా 50 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. నాబార్డు ద్వారా మర్ని మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలన్నారు. మహిళా సంఘాలకు నాబార్డు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మ న్ అడ్డి భోజారెడ్డి, ఎల్డీఎం చంద్రశేఖర్, నా బార్డు అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధికి చర్యలు చేపట్టాలి
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో పురపాలక సంఘం అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, రిమ్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సంబంధించిన శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటి పన్ను వసూలు వందశాతం పూర్తిచేయాలని, ప్రతి వార్డులో పరిసరాల శుభ్రతతో పాటు తాగునీరు, విద్యుత్, తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కూడళ్లలో గడువుతీరిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ నెల 3న మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం వైద్యాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో శ్రీకాంత్, డీఎంవో శ్రీధర్, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దళిత బంధును పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లాలో దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. దళిత బంధు పథకం అమలుపై కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా వందమంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై చర్చించారు. సమావేశంలో జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పద్మభూషణ్ రాజు, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, అదనపు జడ్పీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎల్డీఎం చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలపై అధ్యయనం చేయాలి
గిరిజనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలు, జీవన స్థితిగతులపై అధ్యయనం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ బృందంతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలో నెల రోజుల పాటు పర్యటించి గిరిజనుల జీవన శైలి, వారి స్థితిగతులపై అధ్యయనం చేయాలన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి, గిరిజనుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రపతికి నివేదిక అందిస్తామని బృందం సభ్యులు కలెక్టర్ కు వివరించారు. బృందం సభ్యులు తూజావత్ గణేశ్‌నాయక్, అక్షయ్, వైష్ణవి పాల్గొన్నారు.