భారీ వర్షాలు.. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వివిధ శాఖల సహకారంతో వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. వైద్యశాఖ చేపడుతున్న ఏర్పాట్లపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమగ్రంగా వివరించారు.
– నిర్మల్, జులై 12(నమస్తే తెలంగాణ)
నమస్తే ః సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి?
డీఎంహెచ్వో : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముందస్తు జాగ్రత్తలతో వ్యాధులను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ముందస్తుగానే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, ఏమైనా వ్యాధి లక్షణాలు కన్పిస్తే త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేస్తున్నాం. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉండాలని చెప్పాం. పంచాయతీరాజ్ శాఖ, ఇతర శాఖలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకుని వ్యాధులను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నాం.
నమస్తే : వ్యాధుల నియంత్రణ కార్యాచరణ ఎలా ఉంది?
డీఎంహెచ్వో : జిల్లాలో 16 పీహెచ్సీలు, 3 సీహెచ్సీలు, 18 వరకు పల్లె, పట్టణ బస్తీ వెల్నెస్ సెంటర్లున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జిల్లా వ్యాప్తంగా 570 ప్రత్యేక వైద్య బృందాలు ప్రజారోగ్య పరిరక్షణలో నిమగ్నమయ్యాయి. ఈ సీజన్లో ముఖ్యంగా కలుషితాహారం, కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా(అతిసార) ప్రబలే అవకాశం ఉండడంతో ఈనెల 13 నుంచి 27 వరకు డయేరియా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాం. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నారు. స్థానిక వైద్య కేంద్రాల్లోనూ అవసరమైనన్ని ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.
నమస్తే : వ్యాధుల తీవ్రతపై పల్లెలు, పట్టణాల్లో గతానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మాటేమిటి?
డిఎంహెచ్వో : ఒకప్పుడు వానాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాలు, మారుమూల ఆవాసాల్లోని ప్రజానీకం సీజనల్ వ్యాధులతో అల్లాడిపోయేవారు. రోజులకు రోజులు మంచం పట్టే పరిస్థితులుండేవి. పెద్దసంఖ్యలో క్యాంపులు ఏర్పాటుచేసి వైద్యం అందించాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. ప్రభుత్వ వైద్యం పల్లె ప్రజలకు చేరువైంది. వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి మందులను అందజేస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో పారిశుధ్యం మెరుగుపడింది. మిషన్ భగీరథ నీటి సరఫరా మొదలైన తర్వాత నీటి ద్వారా వచ్చే జబ్బులు సైతం తగ్గుముఖం పట్టాయి. గతంతో పోలిస్తే మలేరియా, డెంగీ, డయేరియా వంటి కేసులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడైనా ఒకటీ రెండు కేసులు నమోదుకాగానే ఆప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టి వ్యాధుల నివారణకు చర్యలు చేపడతాం. అసరమైతే ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
నమస్తే : కరోనాను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
డిఎంహెచ్వో : ప్రస్తుతం జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదైన దాఖలాల్లేవు. అయినప్పటికీ పూర్తి అప్రమత్తతతో ఉండాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసుకునేలా చూడాలని సూచనలు చేసింది. ఇప్పటికే కొవిడ్ రెండు డోసులు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకునేలా చైతన్య పరుస్తున్నాం.
నమస్తే : వ్యాధుల పట్ల ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి ?
డిఎంహెచ్వో : ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలి. పరిశుభ్రమైన ఆహారంతోపాటు కాచి వడబోసిన నీటినే తాగాలి. మందుల కొరత లేదు. అవసరమైన వారు కేంద్రాలకు వచ్చి మందులను తీసుకెళ్లవచ్చు. వైద్య సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అడిగినా.. అవసరమైన మందులను ఇస్తారు. ఏవైనా టెస్టులు అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేయించుకునే అవకాశం ఉంది. సబ్ సెంటర్లలో సంబంధిత నమూనాలను ఇస్తే పరీక్షల నిమిత్తం వాటిని జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు పంపించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అవసరమైన మందులను అందజేస్తారు.
నమస్తే : ఈ సీజన్లో ఏయే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నివారణ చర్యలేమిటి?
డీఎంహెచ్వో : మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈ తరహా వ్యాధులు నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడా సీజనల్ వ్యాధులకు సంబంధించి కేసులు నమోదు కాలేదు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటు వ్యాధులకు కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకు స్థానిక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటున్నాం. వర్షపు నీటి గుంతల్లో, మురుగు కాల్వల్లో, తడిసిన చెత్త కుప్పల్లో, ఇతర నీటి గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహిస్తున్నాం.