నార్నూర్, ఫిబ్రవరి11: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోనే పంటలు విక్రయించుకోవాలని పేర్కొన్నారు. క్వింటాల్ కందికి రూ.6,300 చెల్లిస్తున్నదని, ఉమ్మడి మండలాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చెల్లించే ధర రైతుకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. మార్క్‌ఫెడ్ డీఎం పుల్లయ్య మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి రైతులు నాణ్యతతో కూడిన కంది పంటను తీసుకోరావాలన్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం,ఆధార్‌కార్డు, బ్యాంక్పాస్ బుక్ జిరాక్స్ వెంట తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు మొదటిసారిగా కొనుగోలు కేంద్రంలో కందిపంటను విక్రయించిన రైతును శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేశ్, ఎంపీటీసీ పరమేశ్వర్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు కొరల మహేందర్, టౌన్ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్నూర్ పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తామని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. పంచాయతీలోని సమస్యలను సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్ జడ్పీచైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. నార్నూర్ పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో నిధులు కేటాయించేలా తనవంతు కృషి చేస్తామన్నారు. జిల్లాకే ఆదర్శంగా పంచాయతీని తీర్చిదిద్ధుతున్న సర్పంచ్‌ను అభినందించారు. ఉప సర్పంచ్ చౌహాన్ మహేందర్, పంచాయతీ కార్యదర్శి దినేశ్, ఎంపీటీసీ పరమేశ్వర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, వార్డు సభ్యులున్నారు.