భీంపూర్/బెజ్జూర్, నవంబ ర్21 : బెజ్జూర్ మండలంలోని కొత్తగూడ, రెబ్బెన, బాబాసాగర్, కర్జెల్లి తదితర గ్రామ శివారులో పులి సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీ అధికారులు పులి అడుగులను పరిశీలించి ఎటూ వైపు వెళ్తున్నదోనని ట్రేస్ చేస్తున్నారు. తాజా గా సోమవారం రాత్రి 11 గంటల ప్రాం తంలో కర్జెల్లి రేంజ్ పరిధిలోని కుకుడ గ్రా మంలో కాతెల శ్యాంరావ్ తన కొట్టంలో కట్టేసిన ఎద్దుపై దాడి చేసి గాయపర్చింది. ఎద్దు అరుపులు విని అప్రమత్తమైన శ్యాంరావ్ , కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ఉదయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, కర్జెల్లి రేంజ్ కాటెపల్లి సెక్షన్ అధికారి వందన, బీట్ అధికారి మురళి, బెజ్జూర్ రేంజ్ యానిమల్ ట్రాకర్స్ సిబ్బంది పులి సంచరించిన ప్రదేశాల్లో పాద ముద్రలను పరిశీలించి నిర్ధారించారు.
కర్జెల్లి రేంజ్‌లోని అంబాగట్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని, అక్కడ కూడా ఒక అడవి పందిని హతమార్చి తిన్నట్లు బెజ్జూర్ రేంజ్ అధికారి దయాకర్ తెలిపారు. ఈ పులి ఆదివారం నుంచి కడంబ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఆడ్పల్లి, డబ్బా, కొత్తగూడ, బాబాసాగర్ , కుకుడ, మర్తిడి తదితర గ్రామాల్లోని పత్తి చేనుల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఈ పులి కొత్తగా ఈ ప్రాంతాల్లోకి రావడంతో స్థిరనివాసం కోసమే వెతుకులాటలో ఉందని పేర్కొన్నారు. శివపల్లి అటవీ ప్రాంతానికి పులి వెళ్తే అక్కడే తన ఆవాసంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఈ ప్రాంతం నచ్చకుంటే ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాపరులు, ఇతరాత్ర అవసరాల కోసం ప్రజలు అ టవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, రైతులు పత్తి చేనులకు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
తాంసి(కే) సరిహద్దులో ఆవు, ఎద్దు మృతి
మండలంలోని సరిహద్దు పెన్‌గంగ శివారు గొల్లగడ్ , తాంసి (కే) అటవీప్రాంతంలో సోమవారం పెద్ద పులులు హల్చల్ చేశాయి. దీంతో పిప్పల్‌కోటి రిజర్వాయర్ కట్ట పనులను ఆపివేశారు. మరో వైపు చేనుల్లోని రైతులు ఇంటి బాట పట్టారు. తాంసి మం డలం పొన్నారికి చెందిన ఆటో డ్రైవర్ రైతు స్వామి చేనులో పత్తి ఏరే కూలీలను, కావాలికి కర్రలను తాంసి(కె) కే తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా బోర్లకుంట ప్రాంతంలో రోడ్డు పక్కన నాలుగు పెద్ద పులులు కనిపించాయని, ఇందులో ఒక తల్లి పులి మూడు పిల్ల పులులు ఉన్నట్లు చెప్పాడు. ఇదే సమయంలో తాంసి (కే) అడవిలో పశువుల మందలు మేస్తున్నా యి. ఈ క్రమంలో రెండు పులులు మందపై దాడి చేసి అన్నెల స్వామి ఎద్దును, పక్కన ఉన్న మరో ఆవుల మందపై పంజా విసిరి మడావి శంకర్ ఆవు దూడ చంపివేశాయి. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ , ఎఫ్‌బీవో శరత్‌రెడ్డి , కేశవ్ అక్కడికి వచ్చి పులి పాదముద్రలు గుర్తించారు. అదనంగా కెమెరాలు అమర్చారు. భయపడవద్దని అవగాహన కల్పించారు. ఇదిలాఉంటే బేస్‌క్యాంపు, యానిమల్ ట్రాక్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులకు నిబంధనల మేర ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్ చెప్పారు.