దండేపల్లి, నవంబర్ 21: ఈ యేడాది జూలై నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగింది. యేటా యాసంగిలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకం నీట మునగడంతో అన్నదాతలు నిరాశ చెందారు. వానకాలం సీజన్ అన్నదాతలకు అస్సలు కలిసి రాలేదు. ఎడతెరిపి లేని వర్షాలకు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి తీర ప్రాంతాల్లోని రైతులు నిండా మునిగారు. వరదలకు ఇసుక, పెద్ద పెద్ద రాళ్లు మేటలు వేసి పంట పొలాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల కష్టపడి వేసుకున్న పంటలు చేతికొచ్చాయి. ప్రస్తుతం గూడెం లిఫ్టు మోటార్ల మరమ్మతులు వేగంగా సాగుతుండడంతో రైతులు యాసంగిపై దృష్టి సారిస్తున్నారు. పలుచోట్ల నారుమడులు కూడా సిద్ధం చేస్తున్నారు.
చనాకా-కొరాటా నుంచి సామగ్రి
భారీ వర్షాలకు మోటార్లతో పాటు ప్యానల్ బోర్డులు దెబ్బతిన్నాయి. మోటర్లు, ఇతర మరమ్మతులు పూర్తి చేసినా ప్యానల్ బోర్డులు అందుబాటులో లేకపోవడంతో వీటిని ఆదిలాబాద్ సమీపంలోని చనాకా-కొరట ఎత్తిపోతల పథకం వద్ద నుంచి గురువారం సాయంత్రం తెప్పించారు.11 ప్యానెల్ బోర్డులు, 3 కేబుళ్లు, 44 వోల్టేజీ సామర్థ్యం గల 86 బ్యాటరీలు, చార్జర్లతో పాటు ఇతర సామగ్రి తెప్పించారు. పథకం నిర్వహణను పర్యవేక్షిస్తున్న మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేపట్టి వీటిని బిగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీ వల రాష్ట్ర ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు, ఇతర అధికారులు పథకాన్ని సందర్శించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకో వాలని అధికా రులను సూచించారు.
30 వేల ఎకరాలకు సాగునీరు
గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యేటా 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఎల్లంపెల్లి జలాశయ నిల్వ నీటిని(బ్యాక్ వాటర్)గూడెం సమీపంలోని గోదావరి తీరాన నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా పంటలకు సరఫరా చేస్తున్నారు. గూడెం ఎత్తిపోతల పథకం నీటిని మండలంలోని తానిమడుగు సమీపంలోని కడెం ప్రధాన కాల్వలో 30వ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి 42-కాల్వ ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. గతేడాది జనవరి 6న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చేతుల మీదుగా యాసంగి నీటిని తానిమడుగు సమీపంలోని కడెం ప్రధాన కాల్వలో 30వ డిస్ట్రిబ్యూటరీ వద్ద విడుదల చేశారు. పనులు త్వరితగతిన పూర్తయితే ఈసారి కూడా నీరందించే అవకాశాలున్నాయి.
వర్షాలకు మునిగిన ఎత్తిపోతలు
జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగింది.దీంతో అందులో ఉన్న మోటార్లతో పాటు ఇతర సామగ్రి పాడయ్యింది. నీటిని ఎత్తిపోసే రెండు టర్బైన్ మోటర్లు, జనరేటర్, బేరింగ్లు, విద్యుత్ ప్యానెళ్లు పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయి. 4.2 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు పంపులు పూర్తిగా మునిగిపోవడంతో భారీగా నష్టం వాటిల్లింది.
యాసంగికి నీరందించేందుకు కృషి చేస్తున్నాం
నీట మునిగిన పంపులు, ఇతర సామగ్రికి సంబంధించిన పనులు చేపడుతున్నాం. దాదాపు పూర్తికా వస్తున్నాయి. 11 ప్యానెల్ బోర్డులు, 3 కేబుళ్లు, 44 వోల్టేజీ సామర్థ్యం గల 86 బ్యాటరీలు, చార్జర్లతో పాటు ఇతర సామగ్రి చనాకా-కొరట ఎత్తిపోతల పథకం నుంచి తెప్పించాం. వీటిని బిగించి యాసంగికి నీందించేందుకు కృషి చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సహకారంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయితే యాసంగి నీటి విడుదలపై ప్రకటన చేస్తాం.
– రాజశేఖర్ గౌడ్, ఈఈ, ఎత్తిపోతల పథకం