నిర్మల్ టౌన్, నవంబర్ 19 : మామడ మండలంలోని కమల్‌కోట్ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ ప్రాజెక్టును ఏప్రిల్‌లోగా పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, 27, 28 ప్యాకేజీ పనులపై శనివారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెక్‌డ్యాంలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సదర్మాట్ ప్రాజెక్టులో పనులను వేగవంతం చేసి నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. గేట్లను అమర్చి నీటి నిల్వకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27 ప్యాకేజీ పనుల్లో భాగంగా రైతుల కోసం రూ.35 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 28 ప్యాకేజీ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుం టల పునరుద్ధరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో ఏసీడీపీ నిధులతో చేపట్టే పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏసీడీపీ నిధుల పనులపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏసీడీపీ ద్వారా మంజూరైన పనులు, ప్రారంభమైనవి, పెండింగ్, పూర్తయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాం బాబు, హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, లోకేశ్వర్‌రావు, జడ్పీటీసీలు జీవన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రామయ్య, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 19 : విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలతో నూతన ఆవిష్కరణపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఈ నెల 24 నుంచి 26వరకు జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించే ఇన్స్ఫైర్, విజ్ఞాన ప్రదర్శన పోస్టర్లను మంత్రి క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదునుపెట్టి, సృజనాత్మక ఆలోచనలతో కొత్త కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేసుకోవాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు ఎంపికయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, సెక్టోరల్ అధికారులు రాజేశ్వర్, నర్సయ్య, ఎంఈవో వినోద్ కుమార్, డీఎస్వో వినోద్ కుమార్, వివిధ ఉపాద్యాయ సంఘాల నాయకులు జుట్టు గజేందర్, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్తసాయి ఆలయంలో వచ్చే నెల 5న నిర్వహించే దత్త జయం తి వేడుకలకు సంబంధించిన పోస్టర్లను క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గండిరామన్న ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామన్నారు.
డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు దత్త జయంతి వేడుకలు, ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు తొమ్మిదోసారి సాయి పారాయణ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం షిర్డీ నుంచి తెచ్చిన సాయి పల్లకీ, సాయి పాదుకలను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, ముత్యం సంతోష్ గుప్తా, మహేందర్ యాదవ్, ఆమెడ శ్రీధర్, లక్ష్మణ్, శ్రీను, భూషణ్, రమణ, రేఖ, కళ్యాణి, ప్రియ తదితరులు పాల్గొన్నారు.