నిర్మల్ అర్బన్, నవంబర్ 19: నిర్మల్ జిల్లాకేంద్రంలో ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ కార్యక్రమాలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సైన్స్ ఫెయిర్‌లో జూనియర్, సీనియర్ విభాగాల వారీగా 400 ప్రదర్శనలు రానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం 5 ప్రాజెక్టులు తీసుకువచ్చేలా హెచ్ఎంలకు ఆదేశాలిచ్చారు. జిల్లాలోని 19 మండలాల్లో 258 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 47,320 మంది, 189 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, ఇందులో 48,660 మంది విద్యార్థులున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన 14 ప్రదర్శనలను (జూనియర్ 7, సీనియర్ 7) రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
2020-21 విద్యాసంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 1200 ప్రదర్శనలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అత్యత్తమ ప్రదర్శనల (15 శాతం) ప్రకారం ప్రాజెక్టులను ఎంపిక చేయగా నిర్మల్ జిల్లా నుంచి 167 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేలు అందజేసింది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో తయారు చేసి, వీటిని కూడా ఈ మేళాలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సభ్యులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన శుభంకర్ రానున్నారు. 10-12 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మేళాకు పంపనున్నారు. అక్కడ ప్రతిభ చూపితే జాతీయ స్థాయికి ఎంపికవనున్నాయి. గతంలో నిర్మల్ జిల్లాలోని మామడ మండలం అనంతపేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు డ్రైవర్ అలర్ట్ (వాహన డ్రైవర్‌ను అప్రమత్తం చేసే పరికరం) ప్రాజెక్టును తయారు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈఏడాది ఇన్స్పైర్ ప్రాజెక్టులలో అత్యధిక ప్రాజెక్టులు సమర్పించిన జిల్లాల్లో నిర్మల్ రెండో స్థానంలో నిలిచింది.
నిర్మల్ జిల్లాలో ఈనెల 24 నుంచి నిర్వహించే సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ ప్రదర్శనలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చదువు, ఆటలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలి. జిల్లాలో అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు సిద్ధం చేయాలని హెచ్ఎంలకు సూచనలు చేశాం. మొత్తం 1000 ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం 19 కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం.
-డీఈవో రవీందర్ రెడ్డి, నిర్మల్
ఇన్స్పైర్ మేళాకు ఆన్లైన్లో 1200 అప్లికేషన్లు వెళ్లా యి. దీంతో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 167 ప్రదర్శనలను ఈనెల 24 నుంచి 26 వరకు ప్రదర్శించబోతున్నారు. ఇందులో 12 ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి ఎంపిక చేస్తాం. జాతీయ స్థాయికి ప్రదర్శనలు ఎంపికయ్యేలా గైడ్ టీచర్లు కృషి చేస్తున్నారు.
-డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి