నార్నూర్, నవంబర్ 19 : పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్టు)కు అభ్యర్థులు తపనతో సన్నద్ధమవుతున్నారు. కొలువును చేజిక్కించునేందుకు అందివచ్చిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. నార్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో సర్పంచ్ యుర్వేత రూప్‌దేవ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా దేహదారుఢ్య శిక్షణ శిబిరం కొనసాగుతున్నది.
150 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు ప్రిలిమినరీ (ప్రాథమిక రాత పరీక్ష)కు 400 మందికి తర్ఫీదు అందించిన విషయం తెలిసిందే. వారిలో 300 మందికి పైగా అర్హత సాధించారు. వారి ఆసక్తి మేరకు రెండో దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పది రోజుల కిందట గంగాపూర్‌లో ప్రారంభమైన దేహదారుఢ్య ఉచిత శిక్షణకు 150 మంది మహిళలు, పురుషులు హాజరవుతున్నారు. సదరు పరీక్షల నిమిత్తం ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకు శిబిరం కొనసాగించేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.
పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ తదితర వాటిపై మెళకువలు చెబుతూ సిద్ధం చేస్తున్నారు. నిత్యం శిబిరానికి రాగానే తొలుత ధ్యాన సాధన, వివిధ రకాల శ్వాసకు సంబంధించిన కసరత్తు, నడక, పరుగు, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. సర్పంచ్‌లు యుర్వేత రూప్‌దేవ్, రాథోడ్ సావీందర్, సీఐ ప్రేమ్‌కుమార్, రెండు రోజులకోసారి ఇద్దరు ట్రైనర్ల భాగస్వాములు అవుతున్నారు. శిక్షణ పొందే వారికి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ, వ్యాపారవేత్త ఇన్సూఅక్బానీ సొంత ఖర్చులతో అరటిపండ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇస్తున్నారు.
పేద విద్యార్థులు పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటూ, హాస్టల్లో ఉండాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటి అభ్యర్థుల కోసం పది రోజుల కిందట జడ్పీ చైర్మ న్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీఐ ప్రేమ్‌కుమార్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. తమకున్న సహాయశక్తులతో ప్రిలిమినరీ ఉత్తీర్ణత సాధించిన పోలీస్ అభ్యర్థులు శిక్షణ పొందేలా కృషి చేస్తున్నాం. ఉదయం 5 నుంచే ఇక్కడ సాధన చేస్తున్నారు.
-ఉర్వేత రూప్‌దేవ్, సర్పంచ్, గంగాపూర్
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన పేద అభ్యర్థులకు ఈవెంట్స్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. వీరికి ముఖ్యంగా పరుగు, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ ఎంతో కీలకం. వీటిలో మెరిట్ కనబర్చిన అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
-కే ప్రేమ్‌కుమార్, సీఐ, నార్నూర్
శిక్షణ తీసుకున్న తర్వాత నాలో ఆత్మైస్థెర్యం పెరిగింది. శిక్షణ తీసుకోక ముందు పరుగెత్త లేకపోయేవాడిని. రోజు 1600 మీటర్ల వరకు ఆలసట లేకుండా పరుగెడుతున్నా. ఇప్పుడు బ్రీతింగ్ సమస్య లేదు. ట్రైనర్లు, సీఐ ఇచ్చిన శిక్షణ ఈవెంట్స్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. నాలో శక్తి పెరిగింది. ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నాను. శిక్షణ తీసుకున్న తర్వాత నాలో పట్టుదల పెరిగింది.
-పెందూర్ దీపక్, శిక్షణ పొందుతున్న అభ్యర్థి
నాది నిరుపేద కుటుంబం. పట్టణాలకు వెళ్లి శిక్షణ పొందే ఆర్థిక స్తోమతలేదు. పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఉచిత శిక్షణను ఇవ్వడం సంతోషంగా ఉంది. పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఉపయోగపడుతుంది.
-మెస్రం మోతీరాం, శిక్షణ పొందుతున్న అభ్యర్థి