Samantha | నటి సమంత రూత్ ప్రభు మరోసారి సామాజిక అంశంపై తన గళాన్ని వినిపించారు. మహిళల విషయంలో సమాజం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లింగ వివక్ష, పురుషాధిక్యత, మహిళలపై నిందలు వేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సమాజం ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరాన్ని సమంత తన పోస్ట్ ద్వారా చెప్పినట్లు తెలుస్తోంది. సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘మనం ఇప్పటికీ మార్పు తీసుకురాగలం’ అనే ఆలోచనతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. ఇందులో సమాజంలో మహిళల విషయంలో కనిపించే కొన్ని వైరుధ్యాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
సెక్స్ వర్కర్లను మాత్రమే తప్పుపడుతూ.. వారి వద్దకు వెళ్లే క్లయింట్లను ఎందుకు ప్రశ్నించరని ఆమె నిలదీశారు. అలాగే ఒంటరి తల్లులపై సమాజం విమర్శలు చేస్తుందని, కానీ పిల్లల బాధ్యతను పట్టించుకోకుండా దూరంగా ఉండే తండ్రులను మాత్రం అదే స్థాయిలో ప్రశ్నించరని పేర్కొన్నారు. అత్యాచార ఘటనల విషయంలో కూడా సమాజం అనుసరిస్తున్న వైఖరిపై సమంత ప్రశ్నలు లేవనెత్తారు. నేరానికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించాల్సిన సమయంలో.. బాధితురాలి దుస్తులు, ప్రవర్తన, బయటకు వెళ్లిన సమయం వంటి అంశాలపై చర్చించడం ఎందుకని ఆమె సందేశం ద్వారా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.అలాగే తప్పులు చేసిన వ్యక్తులను ప్రశ్నించకుండా.. ఆ తప్పులను బయటకు తీసుకువచ్చి మాట్లాడే వారినే నిందించే పరిస్థితి కూడా సమాజంలో ఉందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మహిళలపై వివక్ష, బాధితులను నిందించే ధోరణి, పురుషులు-మహిళల విషయంలో వేర్వేరు ప్రమాణాలు వంటి అంశాలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సమంత గతంలోనూ మహిళలకు సంబంధించిన పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. ఈసారి కూడా ఎవరినీ ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. సమాజంలో కనిపిస్తున్న కొన్ని ద్వంద్వ ప్రమాణాలను ఉదాహరణలుగా తీసుకుని ప్రశ్నించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.సమాజంలో లింగ సమానత్వం రావాలంటే మహిళల ప్రవర్తనను మాత్రమే కాకుండా.. పురుషుల బాధ్యత, వ్యవస్థలోని లోపాలు, బాధితుల పట్ల వ్యవహరించే తీరుపై కూడా సమానంగా ప్రశ్నలు ఉండాలని సమంత సందేశం సూచిస్తోంది.