జొన్నరొట్టె.. ఒకప్పుడు పేదల ఆహారం. క్రమంగా వరి అన్నం అలవాటు చేసుకోవడంతో జొన్నల వినియోగం తగ్గిపోయింది. వీటిని తిన్న మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. నేడు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడిన ప్రజలను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తిరిగి సంప్రదాయ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. షుగర్, బీపీలతో బాధపడేవారికి జొన్నరొట్టె దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పల్లె రుచుల పేరిట వెలిసిన జొన్న రొట్టెల విక్రయ కేంద్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రోడ్డు పక్కన కట్టెల పొయ్యిపై తయారుచేసే ఈ రొట్టెలను లొట్టలు వేసుకొని తింటున్నారు.
జొన్న రొట్టెలు దివ్య ఔషధంలాంటివి. రొట్టెల తయారీలో చుక్క నూనె కలపకుండా తయారు చేస్తారు. కేవలం వేడి నీళ్లతోనే రొట్టె తయారవుతుంది. ఈ విధంగా చేసే రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జొన్న రొట్టెలు తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. జొన్న పిండిని వేడి నీటిలో కలిపి ముద్దగా చేసుకొని దాన్ని చేతిలో గుండ్రంగా తయారు చేసే నైపుణ్యం సాధించాలి. చేతిలో వేసుకొని గుండ్రంగా తిప్పి వెడల్పుగా రొట్టెను తయారు చేయాలి.
పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం జోవార్(జొన్న). గ్లూటెన్ లేకపోవడం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూక్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మధుమేహులకు చక్కగా పనిచేస్తుంది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాఖాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జొన్నలో 10.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుం ది. మన శరీరానికి ప్రతి రోజూ అవసరమైన ఫైబర్‌లో ఇది 40 శాతం అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
గుండె మంచిగా పనిచేసేలా దోహదపడుతుంది. గ్లూటెన్ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్ డిసెజెస్) ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్, కాల్షియం, విటమిన్ బీ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్వంటివి ఉన్నవి. దీని వల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడుతాయి. జొన్న రొట్టెతో బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, గ్యాస్ సమస్యకు విరుగుడుగా ఉండడం, ఎముకలు పటిష్టంగా ఉండడం, కొవ్వు శాతం తగ్గడంలాంటి లాభాలు ఉన్నాయి.
చపాతీలు తక్కువ కాలంలోనే తినేయ్యాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కానీ జొన్న రొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనాఏ ఇబ్బంది లేకుండా తినేయవచ్చు. జొన్న రొట్టెలలో ఉన్న రెండు రకాల్లో ఒకటి సాఫ్ట్ రోటీ.. ఇది మెత్తగా ఉంటుంది. కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. సాఫ్ట్ రోటీని వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మారుమూల పల్లెలు, గూడేల్లో ఇప్పటికీ అనేక మంది జొన్నరొట్టెనే ఆహారంగా తీసుకుంటారు. బీ కాంప్లెక్స్ విటమిన్స్‌కు తోడు ఫైబర్, విటమిన్-ఏ, విటమిన్-సీ, క్రూడ్ ఫ్యాట్, అమినో, యాసిడ్ ఇలా అనేక పోషకాలు ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులకు ఇది చక్కని భోజనం అంటున్నారు. ప్రస్తుతం షుగర్‌తో పాటు ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రాత్రిపూట జొన్న రొట్టెలనే ఆహారంగా తీసుకుంటున్నారు. గతంలో ఇండ్లలోనే రొట్టెలు తయారు చేస్తుండగా, నేటి తరం మహిళలకు వీటి పట్ల అవగాహన కరువైంది.
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వీధుల్లో, హోటళ్లలో రొట్టెల తయారీ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. చపాతి, రోటీ, నాన్, తందూరీ పట్టణాల్లోని హోటళ్లలో బాగా వినిపించే (కనిపించే)ఫుడ్. కానీ ప్రస్తుతం ఇప్పుడు మెనూ కార్డులో జొన్న రొట్టె సైతం చేరింది. ఇంతకుముందు పట్టణాల్లోని హోటళ్లలో జొన్న రొట్టె కనిపించడం అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10-15కే లభిస్తున్న రొట్టెలు, పట్టణాల్లోని హోట్లళ్లలో మాత్రం రూ.50 చొప్పున అమ్ముతున్నారు. జొన్న రొట్టె కేంద్రాల వద్ద రోటీతో పాటు వెజిటేబుల్, చికెన్ కర్రీలాంటి వాటితో కలిపి ఇస్తున్నారు. పచ్చడితో పాటు వెల్లుల్లి కారం కూడా ఇస్తున్నారు.
దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన దొమ్మాటి ఉమకు తిరుపతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. మొదట్లో తమ కులవృత్తి చేసుకుంటూనే ఇండ్లలో వంటలు చేసేది. రెండేళ్ల క్రితం భర్త తిరుపతి కరోనాతో మృతిచెందాడు. నెలల పాటు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించడం వల్ల లక్షల్లో ఖర్చు అయింది. అయినా ప్రాణం దక్కలేదు. ఇద్దరు పిల్లల పోషణ భారం ఆమె తీసుకుంది. ఇండ్లలో వంటలు చేసేటప్పుడు జొన్న రొట్టెలు తయారు చేసేది. అప్పుడప్పుడూ స్థానికులు ఇంటికి వచ్చి రొట్టెలు తయారు చేయించుకొని తీసుకెళ్లేవారు.
ఎలాగైనా జొన్న రొట్టెల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తాళ్లపేట ప్రధాన రహదారి వద్ద పల్లె రుచుల పేరిట రొట్టెలు తయారు చేయడం ప్రారంభించింది. తన భర్త వాళ్ల తమ్ముడి భార్య పల్లవితో కలిసి వ్యాపారం చేస్తున్నది. మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డా.. ఇప్పుడు వ్యాపారం పుంజుకుంది. ఒక్క రొట్టెతో ప్రారంభమైన వ్యాపారం.. వందకు పైగా రొట్టెల అమ్మకానికి చేరింది. వీటితో పాటు సర్వపిండి కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా ఆర్డర్‌పై వివిధ రకాల వంటకాలు చేసి విక్రయిస్తుంది. ఉదయం పలు ఇండ్లలో పనులు చేసుకొని.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రొట్టెలు విక్రయిస్తుంది.
నాకు మొదట్లో జొన్న రొట్టెలు తయారు చేయడం రాకపోయేది. అక్క(ఉమ)తో కలిసి రొట్టెల విక్రయ కేంద్రానికి వెళ్లి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నా. అక్కకు సహాయపడుతూనే, ఇప్పుడు రొట్టెలు తయారు చేస్తున్న. చపాతీలు, సర్వపిండి చేస్తున్న. ఆర్డర్‌పై అంబలి, వివిధ రకాల వెజిటేబుల్, చికెన్, మటన్ కర్రీ తయారు చేస్తున్నాం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కష్టపడుతున్నా. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి చాలా మంది రొట్టెలను తీసుకెళుతున్నారు.
-దొమ్మాటి పల్లవి-తాళ్లపేట.
మేము చిన్నగున్నప్పుడు మా ఇంట్లో జొన్న రొట్టెలు తయారు చేసేటోళ్లు. అప్పట్లో ఇంటిల్లిపాది అవ్వే తినేవాళ్లం. ఇప్పటోళ్లకు జొన్న రొట్టె తయారుచేయడం రాదు. అందుకే ఇక్కడికి వచ్చి కొనుక్క పోతున్న. రూ.15కే జొన్నరొట్టె ఇస్తున్నరు. జొన్న రొట్టె తింటే మంచిదని మా పూర్వీకులు చెప్పేటోళ్లు. ఇప్పటోళ్లు మళ్లీ పాత తిండినే మొదలుపెడుతున్నరు.
-సోయం మధు, తాళ్లపేట