కౌటాల, నవంబర్ 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ కంకలమ్మ-కేతేశ్వర ఆలయం కాకతీయుల పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక పురాతన ఆలయంగా పేరొందింది. భారతదేశంలోనే మేదరు(మహేంద్రలు)ల ఆరాద్య దైవంగా ఉన్న ఏకైక ఆలయం ఇది. దేశంలోనే కౌటాల ఫుణ్య క్షేత్రానికి గొప్ప మహిమలు ఉండడం విశేషం. వందల ఏండ్ల క్రితం డంగుసున్నతం తో భారీ రాతి దిమ్మెలతో దీనిని నిర్మించినట్లు అవగతమవుతున్నది. కౌటాల క్షేత్రములో అక్కడక్కడా పొలాల గట్లపై వినాయకుడు, కుమారస్వామి, నంది, శృంగి, భృంగి, బ్రహ్మ, విష్ణు దేవతల విగ్రహాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. ఈ గుట్టపై పెద్ద నీటి కొలను ఉంది. మధ్యయుగంలో ఇక్కడి దేవాలయాలు, విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేసినట్లుగా పూర్వీకులు చెబుతారు.
ఆలయ పునర్నిర్మాణం
కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సుల్వ కనకయ్య- కల్యాణి దంపతుల సాయంతో శ్రీ కంకలమ్మ కేతేశ్వర ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. 17-03-2008 సోమవారం రోజున వేదపండితులు మహా గణపతి, నవగ్రహ రుద్రహోమములు నిర్వహించి పనులు ప్రారంభించారు. 13-11-2009న వేద పండితుల మంత్రోచ్ఛర ణల మధ్య కంకలమ్మ దేవి, కేతేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ధ్వజ స్తంభములు, నవగ్రహాలు, నాగదేవత విగ్రహాలకు ప్రతిష్ఠాపన చేశారు.
కోర్కెలుతీర్చే కొంగుబంగారంగా..
కౌటాల క్షేత్రంలోని గుట్టపై వెలసిన శ్రీ కంకలమ్మ-కేతేశ్వర స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. యేటా వ్యవసాయం ప్రారంభానికి ముందు రైతులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వా త పనులు మొదలు పెడుతారు. కార్తీక మాసం చివరి ఆదివారం పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. పవిత్ర పెన్‌గంగ, ప్రాణహిత నదుల్లో కార్తీక స్నానం ఆచరించడం వల్ల సకల పాపములు నశిస్తాయని పండితులు చెబుతారు. ఈ నెల 20వ తేదీన జరిగే జాతర మహోత్సవాని కి తెలంగాణ ప్రాంతం నుంచేగాకుండా తమిళనాడు, క ర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, కుటుంబ సభ్యులంద రూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి పూజలు చేసి ఇంటికి చేరేలోగా త ప్పనిసరిగా వర్షం కురుస్తుందని భక్తులు చెబుతుంటారు.
ఇలా వెళ్లాలి..
కౌటాల మండల కేంద్రంలోని కంకలమ్మ ఆలయానికి చేరుకునేందుకు కాగజ్‌నగర్ నుంచి కౌటాలకు ప్రత్యేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సిర్పూర్(టీ) వరకు రైల్వే మార్గం కూడా ఉంది. కాగజ్‌నగర్ నుంచి 40 కిలో మీటర్లు, సిర్పూర్(టీ) నుంచి 20 కిలో మీటర్ల ఉంటుంది. మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో పెన్‌గంగ, 13 కిలోమీటర్ల దూరంలో ప్రాణహిత నదులు నిత్య జీవధారగా ప్రవహిస్తున్నాయి.
అమ్మవారి కృపతోనే ఆలయ నిర్మాణం
అమ్మవారి కృపతోనే కంకలమ్మ కేతేశ్వర ఆలయం నిర్మాణం సాధ్యమైంది. మొదట కూలిపోయిన గుడి మాత్రమే ఉండే. గుట్టపైకి వెళ్లేందుకు కనీసం కాలినడక దారి కూడా లేకుండే. ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు సాధ్యపడలేదు. దీంతో ఎలాగైనా ఆలయాన్ని నిర్మించాలని అమ్మవారికి మొక్కుకొని భక్తుల వద్దకు వెళ్లిన. అందరి సహకారంతో నిర్మాణం పూర్తి చేశాం. దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.
– సులువ కనకయ్య, కంకలమ్మ ఆలయ చైర్మన్, కౌటాల
మా తాతల కాలం నుంచి..
కంకలమ్మ గుడి మా తాతల కాలం నుంచి ఉందట. అమ్మవారికి మొక్కితే తప్పుకుండా కోరికలు తీరుతయని పెద్దలు చెబుతరు. గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకొని పసుపు తీసుకొచ్చి పంటలపై చల్లితే దిగుబడి బాగుంటుందని నమ్మకముంది. అంతటి మహిమ గల దేవత కంకలమ్మ.
– ఉప్పుల సత్తయ్య, కంకలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు, కౌటాల
నిత్య పూజలు
గతంలో కొంతమంది దుండగులు గుప్తనిధుల కోసం అమ్మవారి ఆలయం చుట్టూ తవ్వారు. దీంతో అమ్మవారి ఆలయం మరింత శిథిలం అయింది. కేవలం అమ్మవారి కృపతోనే ఆలయ నిర్మాణం పూర్తి చేశాం. భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. నిత్య కల్యాణం, పచ్చ తోరణంలోగా పూజలు, హోమాలు, అర్చనలు జరుగుతున్నాయి.
– మిద్దెల నాగేశ్వర్రావు, ఆలయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కౌటాల