ఎదులాపురం,మార్చి2: గుట్కా, గంజాయి విక్రేతలు, మట్కా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ బుధవారం మాట్లాడారు. పట్టణంలోని భుక్తాపూర్కాలనీలో మొహమ్మద్ అక్రమ్(34)కు చెందిన గోదాంలో మంగళవారం పెద్ద ఎత్తున గుట్కా పట్టుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.2లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితునిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వివరించారు. నిం దితుడిపై గతంలో సస్పెక్ట్ షీట్ తెరిచామని వెల్లడించారు. గుట్కా, గంజాయి వికేత్రలు, మట్కా నిర్వాహకులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో గుట్కా నిర్మూలనకు కృషి చేస్తున్న స్పెషల్‌బ్రాంచ్ పోలీసులను ఎస్పీ అభినందించారు. గుట్కా నిర్మూలనకు జిల్లాలో ఇప్పటి నుంచి నిత్యం కార్డన్ సెర్చ్‌లు, ఒకేసారి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తామని చెప్పారు. దుకాణాలు, పాన్‌షాపుల్లో రూ.100 గుట్కా దొరికినా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పట్టణ డీఎస్పీ ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ ఎస్ రామకృష్ణ, మహిళా ఠాణా సీఐ మల్లేశ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, ఎస్ఐలు అన్వర్ ఉల్ హక్, జీ అప్పారావు, రవీందర్, ఖలీం స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవీదాస్, బీ ఏసుదాస్ పాల్గొన్నారు.
రూ.2.50లక్షల గుట్కా స్వాధీనం
బేల,మార్చి2: బేల, జైనథ్ మండల కేంద్రాల్లో దాడులు చేసి రూ.2.50 లక్షల గుట్కా స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. జైనథ్ మండలంలోని నోముల విలాస్ రెడ్డి నివాసంలో ప్రమోద్ గది అద్దెకు తీసుకు న్నాడు. అందులో రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు నిల్వచేయగా దాడి చేసి పట్టుకున్నామని వివరించారు. గుట్కా స్వాధీనం చేసుకొని నింది తుడు ప్రమోద్‌తో పాటు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ బీ పెర్సిస్కు అప్పగించి నట్లు తెలిపారు. బేల మండలం ఆసిఫ్ కిరాణ షాపు తనిఖీ చేయగా రూ.40వేల విలువైన గుట్కా దొరికినట్లు తెలిపారు. సందీప్ వద్ద రూ. 10వేల విలువైన గుట్కా లభించినట్లు పేర్కొ న్నారు. స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కే విఠల్, సీసీఎస్ ఎస్ఐ సీ అశోక్, సిబ్బంది బీ ఏసుదాస్, కోటేశ్వరరావు, సురేశ్, జాకీర్ పాల్గొన్నారు.