ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెద్ద పులుల సంతతి పెరుగుతున్నది. తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు అడవులు, గడ్డిక్షేత్రాలు, శాకాహార జంతువులను పెంచడం, వేటగాళ్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం వంటి వాటితో పులుల ఆవాసంగా మారాయి. పది రోజులుగా రహదారులపై ఏదో ఒక చోట జనాలకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో 14 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా 20 మంది సిబ్బందితో రెండు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ పరిధిలో 50 వేల హెక్టార్లలో జింకల పెంపక కేంద్రం ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నారు. వీటి సంతతి పెంపొందించడంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అత్యాధునిక టెక్నాలజీతో వాటి కదలికను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. కాగా.. చేలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, తొందరగా ఇంటికి తిరిగిరావాలని, రాత్రిపూట బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో అడవులను స్మగర్లు యథేచ్ఛగా నరికివేయడంతో పూర్వ ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అడవులు తరిగిపోయాయి. ఫలితంగా జంతువులకు ఆవాసం లేకుండా పోవడంతో స్మగర్ల వేటకు అనువుగా మారింది. చాలా వరకు జంతువులు కనుమరుగు అవుతుండడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు అడవులు, జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయడంతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సాయుధ పోలీసులను నియమించింది. అటవీ ప్రాంతం సరిహద్దులు గుర్తించి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా ట్రెంచ్‌లు ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది పోస్టుల నియామకాన్ని చేపట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కూడా అడవుల విస్తీర్ణం పెరగడానికి దోహదపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో బల్క్ ప్లాంటేషన్ చేపట్టారు. నరికివేతకు గురైన చెట్ల మొదళ్లు సహజంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో అడవులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.
పెరిగిన పులుల సంఖ్య..
గతంలో అడవులు పలుచగా ఉండడంతో జంతువులకు ఆవాసం కరువైంది. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం అడవుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఉమ్మడి జిల్లాలో పులుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కో పెద్ద పులి 25-35 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం జిల్లా అడవులకు అనుకుని ఉంటుంది. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడం, జిల్లా అడవులు పులుల ఆవాసయోగ్యంగా ఉండడం, ఆహారం కూడా పుష్కలంగా లభిస్తుండడంతో తిప్పేశ్వర్ నుంచి పులులు ఇక్కడికి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 14 పులులు ఉన్నట్లు సమాచారం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, ఆదిలాబాద్‌లో 4, మంచిర్యాలలో 2 పులులు నివాసం ఉంటున్నట్లు తెలుస్తున్నది. పది రోజులుగా పులుల సంచారం పెరిగింది. వారం క్రితం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గూడ గ్రామ శివారులో పెన్‌గంగా కాలువలో రెండు పులులు సంచరించాయి. మూడ్రోజుల క్రితం కూడా పిప్పల్‌కోటిలో నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌లో రైతుపై పులి దాడి చేసి చంపేసింది.
సంతానోత్పత్తికి చర్యలు
అధికంగా పులులు తిరుగుతుండడంతో సంతానోత్పత్తికి అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పులులు ఆహారం కోసం పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. పులుల కోసం చెలిమెలు, చెక్‌డ్యాంలు, చిన్నచిన్న నీటి గుంతలు నిర్మించారు. పలు చోట్ల సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. బోర్లు వేసి సోలార్ విద్యుత్ ఆధారంగా నీటిని సరఫరా చేస్తున్నారు. పెద్ద పులులు రోజుకు 10-12 కిలోమీటర్ల మేర సంచరిస్తాయి. ప్రతిరోజు ఒక్కసారి నీరు తాగుతాయి. ఒక్కో పులి యేడాదికి 300 నుంచి 350 వరకు శాకాహార జంతువులను ఆహారంగా తీసుకుంటుంది. అడవి పందులు, జింకలు, దుప్పులు, నీల్గాయ్లు, మనుబోతులు, కొండ గొర్రెలను పెంచుతున్నారు. శాకాహార జంతువులకు అవసరమైన పచ్చిగడ్డి క్షేత్రాలను కూడా పెంచుతున్నారు. దీనికితోడు కవ్వాల్ అభయారణ్యంలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాటికి ఆహారం లభించేలా ప్రణాళికలు తయారు చేశారు. టైగర్‌జోన్‌లో 50 వేల హెక్టార్లలో జింకల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా జింకల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం కూడా పెరుగుతుంది. జిల్లాలో ఉన్న పులులతోపాటు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చేవి కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఆడ, మగ పులులు ఇక్కడే ఉంటూ సంతానోత్పత్తి చేస్తాయి. ఫలితంగా జిల్లాలో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సంచారం నేపథ్యంలో జాగ్రత్తలు
పులుల సంచారం పెరగడంతో అటవీశాఖ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. పులుల కదలికలను తెలుసుకునేందుకు 20 మంది సిబ్బందితో రెండు చోట్ల బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. కవ్వాల్ అభయారణ్యం నుంచి పులి కదలికను తెలుకునే నిపుణులను రప్పించారు. రైతులు తమ చేల నుంచి తొందరగా ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులు ఉద యం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనులు చేసుకుంటున్నారు. సోమవారం భీంపూర్ మండలం గుంజాల అటవీ ప్రాంతంలో పులి హతమార్చిన లేగదూడ కనిపించగా.. ఈ ప్రాంతం పులులు కనిపించిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉంది. పశువులను కూడా అడవుల వైపు వెళ్లకుండా రైతులు చూసుకుంటున్నారు. రాత్రి సమయంలో ప్రజలు ఎటూ వెళ్లవద్దని, పులుల సంచారం కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ వినియోగం
పెద్దపులి కదలికలను వేగంగా తెలుసుకునేందుకు అటవీశాఖ ఆధునిక టెక్నాలజీని విని యోగిస్తున్నది. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులు.. అధికారులు, సిబ్బందికి రామగుండం, ములుగులో శిక్షణ కూడా ఇచ్చారు. పెద్దపులి ఫొటో ఒక్కటి దొరికితే రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది. దాని తల్లి ఏదీ? వంటి సమగ్ర వివరాలు తెలుసుకొనే వీలుంటుంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
డీఎఫ్‌వో దినేశ్ కుమార్
మండలంలోని చౌపన్ గూడ పరిధి ఖానాపూర్ కు చెందిన సిడాం భీము అనే రైతును మంగళవారం పెద్ద పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చౌపన్ గూడ పరిధిలోని ప్రజలు, రైతులు అప్రమతంగా ఉండాలని డీఎఫ్‌వో దినేశ్ కుమార్ సూచించారు. ఖానాపూర్‌లో అటవీశాఖ సిబ్బందితో కలిసి బుధవారం పర్యటించారు. పులి అడుగుల ఆనవాళ్లను గుర్తించేందుకు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి వేర్వేరుగా ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో 12 నూతన కెమెరాలను అమర్చినట్లు డీఫ్వో తెలిపారు. కెమెరా ద్వారా పులి సంచరిస్తున్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. పులి పాదముద్రలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. పులి ఆచూకీ లభించే వరకు ఈ ప్రాంతంలోని రైతులు,పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పులి దాడితో అక్కడి ప్రజలు,రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.