నిర్మల్ టౌన్, నవంబర్ 16 : జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించి, లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ ఆయిల్ పాం సిబ్బందితో ప్రత్యేక సమావేవం నిర్వహించారు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఇంకా డీడీలు చెల్లించని వారు చెల్లిస్తే మొక్కలు అందజేయాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి పథకాలపై సమీక్ష..
జిల్లా గ్రామీణాభివృద్ధి, పల్లె ప్రగతి, వివిధ సంక్షేమ పథకాలపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి ఆధారంగా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికయ్యేందుకు కావాల్సిన అన్ని రిపోర్టులను ఏ రోజుకారోజు సిబ్బంది ఆన్లైన్లో నమోదుచేయాలన్నారు. హరితహారంలో భాగం గా నాటిన మొక్కలను రక్షించాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి శ్యాంరావురాథోడ్, వ్యవసాయశాఖ అధికారి అంజీప్రసాద్ పాల్గొన్నారు.