ఖానాపూర్ టౌన్, జూన్ 2 : మున్సిపాలిటీలో నిర్వహించే అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సభ్యులు, అధికారులకు నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ రాజేందర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డుల్లోని కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు డైరనేజీల పరిశుభ్రత, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, మిషన్ భగీరథ అభివృద్ధి పనులకు కౌన్సిలర్లు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 12 మంది కౌన్సిలర్లు ఉండగా, కనీసం ఐదుగురు కూడా హాజరు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాను సైతం సమావేశ హాలులోకి అనుమతించకపోవడంపై పలువురు కౌన్సిలర్లు అనుమానులు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రత్నాకర్‌రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.