వాంకిడి, నవంబర్ 14 : మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మండల సమాఖ్య సభ్యులతో పాటు ఆదివాసీలు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వాంకిడి మండల కేంద్రంలో ఐకేపీ ద్వారా మే నెలలో రూ.3.56 లక్షలతో తేనె తయారీ, తేనె శుద్ధి పరిశ్రమను ప్రారంభించింది. వివిధ గిరిజన ప్రాంతాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన తేనెను కొనుగోలు చేసి శుద్ధి చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకమైన బ్రాండ్ పేరిట విక్రయిస్తామని ఐకేపీ ఏపీఎం మహేశ్ తెలిపారు.
తేనె తయారీపై శిక్షణ
ఆదివాసీ గ్రామాలైన సవాతీ, ధాబా తేనె తయారీకి అనుకూలంగా ఉండడంతో అధికారులు ఆయా గ్రామాల మహిళలకు అవగాహన కల్పించారు. రెండు నెలల క్రితం వివిధ గ్రామాలకు చెందిన 31 మందితో బృందం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తేనెటీగల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన బాక్సులను శిక్షణ పొందిన వారికి అందించనున్నారు. శిక్షణ పొందిన వారే కాకుండా ఇతరులు కూడా స్వచ్ఛమైన తేనె సేకరించి తీసుకొస్తే కొనుగోలు చేయనున్నారు.
ఇప్పటికే 12 క్వింటాళ్ల 36 కిలోలు సేకరణ
ఇప్పటి వరకు 12 క్వింటాళ్ల 36 కిలోల స్వచ్ఛమైన తేనె కొనుగోలు చేశారు. ప్రస్తుతం శుద్ధి చేస్తూ.. ఆ తేనెను గాజు సీసాల్లో 250,500,100 గ్రాముల చొప్పున వేర్వేరుగా ప్యాకింగ్ చేస్తున్నారు. కిలో స్వచ్ఛమైన తేనె రూ.250 చొప్పున కొనుగోలు చేసి, శుద్ధి చేసి, ఆకర్షణీయమైన గాజు సీసాల్లో నింపి ఉంచుతున్నారు. త్వరలో తేనె ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేసి అధికారుల ఆధ్వర్యంలో ఓ బ్రాండ్ పేరు ఖరారు చేసి అమ్మకాలు జరుపనున్నట్లు ఐకేపీ ఏపీఎం తెలిపారు. శుద్ధి చేసిన తేనెను కిలోకు రూ.500 చొప్పున మార్కెట్లో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ప్యాకింగ్, శుద్ధి, ఆపరేటర్ ఖర్చులుపోనూ కిలో తేనెపై రూ.70 వరకు లాభం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గిట్టుబాటు ధరతో..
ఇప్పటి వరకు 12 క్వింటాళ్ల 36 కిలోల స్వచ్ఛమైన తేనె సేకరించాం. ప్రస్తుతం ప్యాకింగ్ చేస్తున్నాం.మారుమూల ఆదివాసీ గ్రామాల్లో తేనె తయారీపై ప్రత్యేక శిక్షణ బృందంతో ఉచితంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. త్వరలోనే వారికి తేనెటీగల బాక్సులు అందజేస్తాం. మండల సమాఖ్య ఆధ్వర్యంలో నేరుగా మేమే గిట్టుబాటు ధరతో తేనె తీసుకుంటాం. – మహేశ్, ఐకేపీ ఏపీఎం, వాంకిడి
ఉపాధి దొరుకుతుంది
వాంకిడిలో తేనె శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. దీనితో మహిళా సంఘాలకు లబ్ధి చేకూరనున్నది. తేనె ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక సంఘాలతో పాటు అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
– బెల్లాల తార, మండల సమాఖ్య అధ్యక్షురాలు, వాంకిడి