ఎదులాపురం, నవంబర్ 14 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించారు. మొదటి రోజు కావడంతో అధికారులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులతో పాటు ఒకరిని గేట్పాస్ ఇచ్చి అనుమతించారు. ఉదయం 11:30 గంటలకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమక్షంలో వేలం పాట ప్రారంభమైంది. ముందుగానే ప్రజలు ఇబ్బందులు పడకుండా రెండు, మూడుసార్లు మాక్ ట్రయల్ చేశారు. అనంతరం ప్రారంభించారు. డీటీపీసీ అప్రూవల్ లే అవుట్‌లోని 362 ప్లాట్లకు మొదటి రోజున నిర్వహించిన ప్రత్యేక వేలం పాటలో వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తిగల దరఖాస్తుదారులు పాల్గొన్నారు. మొదట ప్లాట్ నంబర్ 8 (13,500 చదరపు గజాలతో) జైనథ్ మండలం మండగాడకు చెందిన ఎన్ నర్సింగ్‌రావు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. సొంత ఇంటి ప్లాట్ కోసం వేలం పాటలో పాల్గొని సొంతం చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం పలు బ్యాంకులు కౌంటర్లను అక్కడే ఏర్పాటు చేసి డిమాండ్ డ్రాప్ట్‌లను అందజేశామన్నారు. వేలం పాటలో అత్యధికంగా ధర తెలిపిన వేలం పాటదారులకు ఆఫర్ లెటర్స్ అందజేసినట్లు చెప్పారు. అత్యధికంగా చదరపు గజానికి రూ.17,100 ధర పలికినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి, డీఎస్పీ వీ ఉమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తహసీల్దార్లు వనజా రెడ్డి, సతీశ్, సంధ్యారాణి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, రెవెన్యూ ,మున్సిపల్ ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
వివిధ సైజుల్లో ప్లాట్లు..
వెంచర్లో ఐదు రకాల సైజులో ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 150 చదరపు గజాలకు సంబంధించి 148 ప్లాట్లు.., 200 చదరపు గజాలకు సంబంధించి 5.., 266 చదరపు గజాలకు సంబంధించి 52.., 150 నుంచి 1088 చదరపు గజాలకు సంబంధించి 53 ప్లాట్లను విక్రయానికి పెట్టారు. కాగా, ప్రస్తుతం వెంచర్లో ప్లాట్ నంబర్‌తో బోర్డు పెట్టి, అందులో ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉన్నది స్పష్టం చేయడం ద్వారా కొనుగోలుదారులకు స్పష్టత ఏర్పడింది. అలాగే వెంచర్లో పక్కా రోడ్లు నిర్మాణం కాకపోయినా మొరంతో ఏర్పాటు చేయడం ద్వారా ఒక రూపు వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో తారురోడ్ల నిర్మాణంతో పాటు విద్యుత్ సౌకర్యం ఇతరత్రా మౌళిక సదుపామాలు కల్పించేందుకు కోట్ల రూపాయాలతో వివిధ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎలాంటి చిక్కులు, సమస్యలు లేని ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం అంటూ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నది.