భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సింగరేణి కార్మికుల సెగ తగిలింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చిన ఆయనను అడ్డుకోవడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచే కార్మిక, వామపక్ష, కుల, ప్రజా సంఘాల నాయకులను ఠాణాలకు తరలించారు. అరెస్టుల పర్వాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై భైఠాయించారు. ధర్నాలు, రాస్తారోకోలు, బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మోడీ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్‌లను అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఠాణాకు తరలించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ,పీడీఎస్‌యూ, టీవీయూపీ,ఎమ్మార్పీఎస్, మాలమహానాడు నాయకులు కూడా ఆందోళనలతో అట్టుడికించారు.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ), నవంబర్ 12 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్ఎఫ్సీఎల్ పర్యటన సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఒకవైపు సింగరేణి కార్మికులు, వివిధ పార్టీలు, విద్యార్థి, కుల సంఘాల నాయకుల నిరసనలు.. మరోవైపు ముందస్తు అరెస్టులతో సింగరేణి గడ్డ అట్టుడికిపోయింది. మోదీ గో బ్యాక్ డిమాండ్‌తో సింగరేణి గడ్డపై అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని ప్రకటన చేసిన సంఘాల నాయకులు, వివిధ పార్టీల లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో టీబీజీకేఎస్, టీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, కార్మికల సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్వీ, పీడీఎస్‌యూ, టీవీయూపీ నాయకులను తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. తాండూరు మండలంలో ఉదయం 4 గంటలకు ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు వారి ఇండ్లలోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తాండూరు, మాదారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. మందమర్రిలో సీపీఐ పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ జనసమితి విద్యార్థి నాయకులు, ఐఎఫ్టీయూ నాయకులు, కాసిపేటలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఏఐటీయూసీ నాయకులు, దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐదుగురు సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండేపల్లి, లక్షెట్టిపేటలో సీపీఐ నాయకులు, కన్నెపల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేశారు. కాసిపేట 2 ఇంక్లయిన్ గని, శ్రీరాంపూర్‌లోని గనులు, గోలేటి, మందమర్రి ఏరియాల పరిధిలోని గనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు.
నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోలీసులు గోదావరిఖని 11 ఇంక్లయిన్ వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య, హెచ్ఎంఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీపీఐ శ్రేణులు జైపూర్‌లో ధర్నాకు దిగారు. మోదీ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ, అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ధర్నాకు దిగిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు శివకుమార్ ఆధ్వర్యంలో నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా నల్లకండువాలు చేతబూనారు. సీపీఎం సీనియర్ నాయకుడు లంకా రాఘవులు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యభవన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీనియర్ నాయకులను పోలీసులు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆదిలాబాద్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ గో బ్యాంక్ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మోదికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ పట్టణంలోని గాంధీపార్కులో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి బెలూన్లతో ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు విలాస్, ఐఎఫ్టీయు నాయకులు రాజన్న, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నవోదయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పదెకరాలు కేటాయించినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మివేస్తుందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం రప్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని తెలిపారు. దేశంలో మతతత్వాన్ని రెచ్చగొడుతూ పాలన సాగిస్తున్న మోదీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సీసీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నాయకులను పోలీసులు తెల్లవారు జామున అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, నాయకులు అల్లూరి లోకేశ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి అత్మకూరి చిరంజీవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి రాజేందర్, నాయకులు తిరుపతిలను శనివారం ఉదయమే పోలీసులు అరెస్ట్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాంకిడి మండలంలోని కిరిడి గ్రామంలో నిరసన తెలుపుతున్న డీవైఎఫ్ఐ, కేబీపీఎస్ నాయకులు గొడిసెల కార్తీక్, దుర్తం దినకర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రెబ్బెనలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా కార్యదర్శి ఉపేందర్, ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి షేషు, నాయకుడు తిరుపతిలను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. తిర్యాని మండలం ఉల్లిపిట్లలో డీవైఎఫ్ఐ నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, దీక్షిత్, నితిన్, పార్దు, నతేశ్లు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు.
సింగరేణిని ప్రైవేటీకరించమని చెప్పిన మోదీ.. కార్మికుల విశ్వాసాన్ని పొందలేకపోయారు. ఉత్త చేతులతో వచ్చి కార్మికుల ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు. కార్మికుల మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
మోదీ మాయమాటలతో గారడీ చేశారు. బొగ్గు బ్లాక్‌లు తవ్వుకునేందుకు అడ్డంకి ఎవరు? కేంద్రమా? రాష్ట్రమా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పెన్షన్ విధానం సవరణతోపాటు వేజ్‌బోర్డు విషయంలో మాట్లాడుతారని కార్మికులు ఎదురుచూశారు. మొండిచేయి చూపారు.
– కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే. బొగ్గు పరిశ్రమలు అన్నీ కేంద్రం చేతిలోనే ఉంటాయి. రాష్ట్రం వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ.. అన్ని రకాలైన నిర్ణయాలు కేంద్రమే తీసుకుంటుంది. కోయగూడెం బ్లాక్ ఆయన స్నేహితుడి అల్లుడికి ఎందుకిప్పించుకున్నాడు.
– జనక్‌ప్రసాద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి.
దేశవ్యాప్తంగా అన్ని సంస్థలను అమ్మినట్టే సింగరేణి బొగ్గు బ్లాక్‌లను కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 15 బ్లాక్‌లను వేలంలో పెట్టి ప్రైవేటీకరణ చేయనని చెబితే నమ్మేందుకు కార్మిక లోకం సిద్ధంగా లేదు.
– మందా నర్సింహారావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి.
2015లో కమర్షియల్ మైనింగ్ పేరిట కొత్త చట్టం తీసుకొచ్చారు. గతంలో క్యాప్టివ్ మైన్స్ పేరిట కాంగ్రెస్ చట్టం తెస్తే.. ఇప్పుడు మోదీ పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టం తెచ్చారు. కోల్ఇండియాలో 240 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం చేశారు. 94 గనులను ఇప్పటికే ప్రైవేటీకరణ చేశారు.
– వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి.
మోదీ ప్రసంగంలో పస లేదు. ఆదాయ పన్ను, కొత్త గనులపై మాట్లాడలేదు. ఆశతో ఎదురు చూసిన కార్మికలోకానికి నిరాశే మిగిలింది. ఇదంతా కూడా రాజకీయ డ్రామా.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.