రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడులకు
మహర్దశ పట్టనున్నది. అందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుతగా 237 పాఠశాలలను ఎంపికచేసి, రూ.48.5 కోట్లు మంజూరుచేసింది. దీంతో పనులు శరవేగంగా పూర్తవుతుండగా, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నది. పనులు పూర్తయితే ఇబ్బందులు తొలగిపోనుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– ఇచ్చోడ, నవంబర్ 12
ఆదిలాబాద్ జిల్లాలో792 పాఠశాలలు ఉన్నాయి. అందులో 141 ప్రాథమిక.., 60 ప్రాథమికోన్నత.., 36 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా, తెలంగాణ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతగా 237 పాఠశాలలను ఎంపికచేసింది. వాటికి కార్పొరేట్ దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, లైబ్రరీ, మరుగుదొడ్లు, డిజిటల్ బోధన వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నది. అందుకు రూ.48.5 కోట్లు మంజూరుచేసింది.
ఎంపికైన 237 పాఠశాలల్లో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు పూర్తయిన 36 పాఠశాలలకు రూ.13కోట్లు యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా పాఠశాలలకు టెండర్లు పిలిచి, పనులను ప్రారంభించారు. కాగా, ఎంపికైన పాఠశాలలన్నీ ఒకే విధంగా కనిపించేలా రంగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.30 లక్షలలోపు వ్యయంతో వసతులు కల్పించే పనులు చేపడుతున్నారు. పాలనాధికారి విడుదల చేసేందుకు అధికారం ప్రభుత్వ కల్పించింది. భవనాలకు బయట, ప్రహరీలకు ఒకే రంగులు, తరగతి గదుల్లో అయిదు రంగులు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
పాఠశాలల్లో పనులపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించి, వివరాలు తెలుసుకుంటున్నారు. స్వయంగా కలెక్టర్ పాఠశాలల్లో జరిగే పనులను పరిశీలించి, నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
జిల్లాలోని పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తుండడంతో తమ ఇబ్బందులు తొలగిపోనున్నాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు-మన బడిలో భాగంగా జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయిన పాఠశాలలకు వారి అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. పనులు త్వరగా పూర్తిచేసి, విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం. పనులపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 36 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
– జే నారాయణ, సెక్టోరియల్ అధికారి, ఆదిలాబాద్ జిల్లా
మన ఊరు-మన బడి కింద మొదటి విడుతలో మా పాఠశాలల ఎంపికైంది. మరమ్మతుల కోసం రూ.40 లక్షలు మంజూరు చేశారు. వర్షానికి గతంలో పాఠశాల గదులు ఊరుస్తుండేవి. ఇప్పుడు అదనపు గదులు, కరెంట్ సరఫరా, తాగు నీరు, వంట షెడ్డు మంజూరయ్యాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. మా పాఠశాలలో చేపడుతున్న పనులతో ఇబ్బందులు తీరుతాయి. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– ఎస్ దత్తు రామ్, చైర్మన్, జడ్పీ ఉన్నత పాఠశాల, సిరికొండ