ఎదులాపురం, నవంబర్ 12 : కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోగా వారికి రాజీ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేలా సుప్రీం కోర్టు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుందన్నారు.
కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా , ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో1022 కేసులు పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మాధవికృష్ణ, సతీశ్ కుమార్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, యశ్వంత్ సింగ్ చౌహాన్, మంజుల, ఏఎస్పీ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, పీపీ ఎం రమణారెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 12 : కేసుల సత్వర పరిష్కారానికి రాజీమార్గమే రాచమార్గమని బోథ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులతో కేసుల్లో ఇరుక్కొని చాలామంది తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారన్నారు. ఇరువర్గాల వారు వచ్చి రాజీ కుదుర్చుకుంటే కేసులు పరిష్కరించవచ్చన్నారు.
రాజీమార్గం ద్వారా 24, ఎస్టీసీ ద్వారా 228, నేరం ఒప్పుకోవడంతో 59, బ్యాంకు అదాలత్ ద్వారా 33 కేసులకు సంబంధించి రూ. 26,52,000 రుణాల రికవరీతో కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్రావ్ దేశ్‌పాండే, కార్యదర్శి పంద్రం శంకర్, ఏజీపీ విక్రమ్, న్యాయవాదులు సుభాష్, రూపేందర్‌సింగ్, హరీశ్, అంగద్ కేంద్రె, కుమ్మరి విజయ్‌కుమార్, ఇచ్చోడ సీఐ ముదావత్ నైలు, పోలీసు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.