కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఏం చేసినవ్..రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక్క ప్రాజెక్టయినా ఇచ్చినవా..కాళేశ్వరానికి జాతీయ హోదా ఏది.. సింగరేణిలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించినవా..ఏటా రూ.4వేల కోట్లు దండుకుంటున్నవ్. ఏమైనా ఒరగబెట్టినవా..ఇన్‌కంటాక్సు మాఫీ చేయించినవా..నల్ల సూర్యుల పెన్షన్ పెంచినవా.. వేతన ఒప్పందం అమలు చేస్తున్నవా..ఎన్టీపీసీలో విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేసినవా..సీసీఐ, జాతీయ రహదారులను పట్టించుకున్నవా.. కొత్తగా రైల్వేలైన్లు మంజూరు చేసినవా..ఇవన్నీ చేయకుండా ఏం ఉద్ధరించడానికి వస్తున్నట్టు?
ఇలా ఎన్నో ప్రశ్నలతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బొగ్గుగని కార్మికలోకం నిగ్గదీసి అడుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు గద్దెనెక్కి ఎనిమిదేండ్లయినా ఈ ప్రాంతానికి చేసిందేంటని నిలదీస్తున్నది. కల్పతరువులాంటి సింగరేణి నుంచి ఏటా వేల కోట్లు దండుకుంటున్న మీరు, ఇన్నేండ్లలో ఉద్ధరించిందేంటని ప్రశ్నిస్తున్నది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఏం చేయకుండా ఏదో చేసినట్టు ప్రచారర్భాటంతో రావడమెందుకని అడుగుతున్నది. అయినా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాదిన్నర క్రితం నుంచే ఎరువులను ఉత్పత్తి చేస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను ఇప్పుడు ప్రారంభించడం వెనుక ఆంతర్యమేంటని మండిపడుతున్నది. పై ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. పర్యటన విషయం తెలిసిన నాటి నుంచే ‘మోదీ గో బ్యాక్’ అంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నది.
స్వరాష్ట్రంలో సింగరేణి సిరులవేణిగా మారింది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు, ఉద్యోగాల నియామకాలు ఇలా అనేక అంశాల్లో పురోగమిస్తున్నది. కానీ, ఈ సంస్థలో 49% వాటా ఉన్న కేంద్రం విషం చిమ్ముతున్నదని కార్మికులు మండిపడుతున్నారు. కేంద్రంతో ముడిపడిన ఏ ఒక్క డిమాండ్‌ను మోదీ సర్కారు పరిష్కరించలేదని ఆగ్రహిస్తున్నారు. శనివారం రామగుండం పర్యటనకు మోదీ ప్రచార్భాటంతో వస్తున్న నేపథ్యంలో తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సాగునీటి రంగంలో సువర్ణాధ్యాయం లిఖిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని, చెమటోడ్చకుండా బొగ్గుపెళ్ల ముట్టకుండా ఏటా 4300 కోట్ల ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నా సింగరేణిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
పారిశ్రామిక కారిడార్‌గా డిక్లేర్ చేసి, సంస్థతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని అడుగుతున్నారు. 2014 జూన్ 4న కార్మికులకు ఇన్‌కంట్యాక్సు మినహాయింపునివ్వాలని ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా స్పందించడం లేదని, కేంద్రం వాటాను కూడా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీఎం స్వయంగా లేఖ రాసినా సమాధానమివ్వడంలేదని, ఎన్ని బ్లాక్‌లు ఇచ్చినా ఉత్పత్తి చేసే సామర్థ్యం సింగరేణికి ఉన్నా కొత్త గనులు ఇవ్వడం లేదని, వేతన ఒప్పందాలు అమలు చేయడం లేదని, వేజ్‌బోర్డు సమావేశాలను వాయిదా వేస్తున్నారని, బొగ్గు గని కార్మికులకు గడిచిన రెండు దశాబ్దాలుగా పెన్షన్ మొత్తాన్ని ఎందుకు పెంచడం లేదని నిలదీస్తున్నారు. కార్మిక చట్టాల మార్పు పేరిట కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, 42కార్మిక చట్టాలను కుదించి, 4 కోడ్లుగా ఎందుకు అమలు చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని సీఎం లేఖ రాసినా అతీగతీ లేదని ఆగ్రహిస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మెగా పవర్‌లూం క్లస్టర్‌గా మార్చాలని, జమ్మికుంటను సెక్టర్‌గా చేయాలని కోరినా స్పందన లేదని మండిపడుతున్నారు. తిమ్మాపూర్ మండలం నేదునూర్‌లో గ్యాస్ పవర్‌ప్లాంట్‌కు గ్యాస్ కేటాయించాలని రాష్ట్ర సర్కారు పదే పదే విజ్ఞప్తి చేసినా, అధికారికంగా ప్రతిపాదనలు పంపినా ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా మార్చే రాజీవ్ రహదారి (స్టేట్ హైవే)ని నేషనల్ హైవేగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ఇలా ఎన్నో డిమాండ్లపై మోదీ సర్కారు వివక్ష ఎందుకు చూపుతున్నదని ప్రశ్నిస్తున్నారు. గద్దెనెక్కి ఎనిమిదేండ్లు గడిచినా ఏ ఒక్కటీ ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.