దండేపల్లి, నవంబర్ 11 ;వ్యవసాయమే జీవనోపాధిగా ముందుకెళ్తున్న ఆ రైతు కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమకున్న 10 ఎకరాల్లో వివిధ పంటలు వేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తూనే.. చేపల పెంపకంపై దృష్టి పెట్టింది. 30 గుంటల్లో చెరువు, 2 గుంటల్లో కుంటను తవ్వించి 6 వేల కొర్రమీను, వేయి రాహు పిల్లలను విడుదల చేసింది. మరో మూడు నెలల్లో దిగుబడి చేతికందనుండగా, రూ. 10 లక్షలకు పైగానే ఆదాయం వచ్చే అవకాశమున్నది. తల్లిదండ్రులతో కలిసి సాగులో ఆదర్శంగా నిలుస్తున్న దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన యువ రైతులు పవన్‌కళ్యాణ్, ప్రశాంత్‌లపై ప్రత్యేక కథనం..
దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ-నారాయణ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో పెద్ద కుమారుడు మురళి అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. మిగతా ఇద్దరు కుమారులు పవన్‌కల్యాణ్, ప్రశాంత్ ఉన్నారు. పవన్‌కల్యాణ్ బీసీఏ, ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేశాడు. ఓ వైపు చదువుకుంటూనే తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. మూడేళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. తమకున్న 10 ఎకరాల్లో నల్లరంగు ధాన్యం, సువాసనలు ఇచ్చే ధాన్యం సాగు చేస్తూనే, చేపల పెంపకంపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలో 30 గుంటల్లో రూ.10 లక్షలతో చేపల చెరువు నిర్మాణం చేపట్టారు. అలాగే పక్కనే మరో 2 గుంటల్లో రూ.15 వేలతో కుంట నిర్మించారు. ముందుగా వ్యవసాయ భూమిలో నేల స్వభావం, నీటి గాఢతలను తెలుసుకోవడానికి వివిధ పరీక్షలు నిర్వహించారు.
కొర్రమీను చేపలతో ఎక్కువ లాభాలు
కొర్రమీను చేపలకు గిరాకీ ఎక్కువ. మిగతా వాటితో పోల్చితే వీటి సాగుతో లాభాలు ఎక్కువ. 4-5 అంగుళాల పొడవు ఉన్న చేప పిల్లలను ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు నుంచి తీసుకువచ్చారు. ఒక్కో చేపపిల్లకు రూ.15 వరకు చెల్లించారు. 30 గుంటల విస్తీర్ణంలో ఉన్న చెరువులో రూ.90 వేల విలువ గల 6 వేల పిల్లలను ఆగస్టు7న వదిలారు. 7 నెలల్లో వీటి సైజు కిలోకు పైగా పెరిగి పంట చేతికి రానుంది. వీటికి మార్కెట్లో దొరికే గ్రోవెల్ న్యూటిలా ఫీడ్‌ను ప్రతి రోజు మూడు పూటలా అందిస్తున్నారు. పంట చేతికి వచ్చే సరికి రూ.4 లక్షల వరకు ఫీడ్ అందివ్వాల్సి ఉంటుందన్నారు. కొర్రమీను చేపలకు మార్కెట్ రూ.350 వరకు ధర పలుకుతుంది. 4.5 టన్నుల పంట చేతికి వచ్చే అవకాశం ఉందని యువరైతులు అంటున్నారు. ఖర్చులు పోను రూ.10 లక్షలపైనే ఆదాయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అలాగే పక్కనే ఉన్న 2 గుంటల్లో రూ.15 వేల ఖర్చుతో కుంట నిర్మించారు.అందులో జగిత్యాల నుంచి తీసుకొచ్చిన వేయి రాహు చేపపిల్లలను రెండు నెలల క్రితం వదిలారు. ఒక్కో పిల్లకు రూ.3ల చొప్పున చెల్లించారు. 6 నెలల్లో పంట చేతికి వస్తుందని, 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. మార్కెట్లో వీటికి కిలోకు రూ.100-150 వరకు ధర ఉందన్నారు. వీటికి నేచురల్ ఫీడ్ తవుడు ఇస్తున్నామన్నారు.
చేపల రక్షణకు వల-వ్యాధులు రాకుండా సేంద్రియ విధానం
చేపల రక్షణకు చెరువుపై మొత్తం వల వేశారు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, హాని కలిగించే కీటకాల రక్షణకు రూ.50 వేలు ఖర్చు చేసి వల వేశారు. చేప పిల్లలు వ్యాధుల బారిన పడకుండా సేంద్రియ విధానాలు అనుసరిస్తున్నారు. చేపలను వదిలిన 15 రోజులకోసారి కళ్లుప్పు, పసుపును చెరువులో వేస్తున్నారు. ఆ తర్వాత వేపాకు రసాన్ని కలుపుతున్నారు. 15 రోజులకోసారి వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తున్నారు. ఇలా మూడు పద్ధతులను అనుసరించడం వల్ల ఇప్పటి వరకు చేపలు ఎలాంటి వ్యాధులకు గురి కాలేదని రైతులు అంటున్నారు. చేపలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుండటం తమకు ఎంతో కలిసి వస్తుందంటున్నారు. చేపలకు అందించే ఫీడ్(దాణా) వాటి వయసును బట్టి ఇవ్వడం జరుగుతుంది. మొదటి నెల(చేప పిల్లలు వదిలిన సమయంలో)1.8 ఎం.ఎం, 2వ నెల 2 ఎం.ఎం నుంచి 3 మీ.మీ మిశ్రమం చేసి ఇస్తున్నారు. ఇలా చివరి వరకు(పంట చేతికి వచ్చే వరకు) 6 ఎం.ఎం ఫీడ్ ఇస్తున్నారు. ఫీడ్ కిలో విలువ మార్కెట్లో రూ.105 వరకు ఉంది.
కలెక్టరమ్మ చెప్పినట్లుగానే చేశాం
మేము సాగు చేస్తున్న సేంద్రియ పొలాన్ని చూసేందుకు కలెక్టరమ్మ భారతీహోళికేరి వచ్చింది. అన్నీ చూసి మమ్మల్ని మెచ్చుకుంది. ఇప్పుడున్న భూమిలోనే చేపల చెరువు నిర్మించుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పడంతో ముందుకెళ్ల్లాం. చేపలు సాగు చేస్తున్న చెరువు నీటిని పొలాలకు వాడుకోవచ్చు. మా పక్కనే ఊర చెరువు ఉండడంతో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. ఇద్దరు కొడుకులు చేస్తున్న కృషితో మా కుటుంబానికి మంచి పేరు వస్తుంది. చెరువు పనులు షురూ చేసినప్పుడు మొదట్లో ఖర్చు ఎక్కువ అనిపించింది. అయినా పట్టువిడవకుండా కుమారులు ఇద్దరు పనిని పూర్తి చేశారు. ఫిబ్రవరి నెల చివరి వరకు పంట చేతికొచ్చే అవకాశం ఉంది.
–నందుర్క సుగుణ-నారాయణ, ఉత్తమ మహిళా రైతు
అమ్మానాన్నల సహకారంతోనే…
అమెరికాలో ఉంటున్న అన్నయ్య సలహా, అమ్మానాన్నల సహకారంతోనే చేపల పెంపకానికి ముందుకు వచ్చాం. సేంద్రియ వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించాం. మొదట్లో మేము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు కొందరు అవహేళనగా మాట్లాడారు. ఇది సాధ్యమయ్యే పనేనా అన్నారు. చేపల చెరువు నిర్మించేటప్పుడు కూడా అట్లనే మాట్లాడారు. కానీ చేపలు పెరుగుతుండడం చూసి ఆనందం అనిపిస్తుంది. శ్రమను నమ్ముకొని ముందుకెళ్తున్నాం. 30 గుంటల్లో రూ.10 లక్షలతో చెరువును నిర్మించుకున్నాం. 4.5 టన్నుల పంట చేతికొచ్చి రూ.10 లక్షల పైనే ఆదాయం వచ్చే అవకాశముంది. – పవన్ కల్యాణ్-ప్రశాంత్, యువ రైతులు