రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ కోల్‌బెల్ట్ వ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. బొగ్గుబావులు, డిపార్ట్మెంట్లపై కార్మికులు, ఉద్యోగులు, పలు కార్మిక సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మూడు రోజుల ఆందోళనలో భాగంగా మొదటి రోజైన గురువారం నల్లసూర్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మోదీ.. గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్న మోదీకి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కు లేదని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఇక.. టీబీజీకేఎస్‌తోపాటు పలు సంఘాల నాయకులు సమావేశమై మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. నేడు(శుక్రవారం) గోదావరిఖనిలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి తరలిరావాలని పిలుపునివ్వగా, చీకటిసూర్యులు సిద్ధమవుతున్నారు.
మంచిర్యాల, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గురువారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బొగ్గుగనులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న నరేంద్ర మోదీకి సింగరేణి గడ్డ మీద అడుగుపెట్టే హక్కే లేదంటూ కార్మికులు ముక్త కంఠంతో నినదించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడికక్కడ నిరసనలు..
మందిమర్రి ఏరియాలో కేకే 5, కేకే 1 గనులు, వర్క్‌షాపులు, ఆర్కే ఓసీపీ, ఆర్కే-1 గనుల్లో నిర్వహించిన నిరసనల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్, ఏరియా కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే- 5, ఎస్సార్పీ-3, ఓసీపీ, ఏరియా వర్క్‌షాప్, సీహెచ్‌పీ, ఆర్కే న్యూటెక్, ఆర్కే -6, ఎస్సార్పీ-1, ఇందారం -1ఏ గనులతో పాటు డిపార్ట్మెంట్లలో జరిగిన నిరసనల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మంద మల్లారెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శాంతిగని, కాసిపేట-1 గనులు, బెల్లంపల్లి ఏరియా దవాఖానల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మాల్రాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కైర్‌గూడ ఓసీపీ, గోలేటి జీఎస్పీ, గోలేటి -1, గోలేటి జీఎం ఆఫీస్, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం ప్రకాశ్‌రావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్‌పీ, జీఎం కార్యాలయం, సివిల్ డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సిబ్బంది, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
గోదావరిఖని/రామగిరి/యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 10 : రామగుండం డివిజన్-1లోని జీడీకే-2, జీడీకే-11గనులతో పాటు తదితర చోట్ల నిర్వహించిన నిరసనల్లో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, ఆర్జీ-3 జీఎం కార్యాలయం, ఓసీపీ-1,2 బేస్ వర్క్‌షాపు, ఏపీఏ ప్రాజెక్టులో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టులో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కోల్సిటీలోని భాస్కర్‌రావు భవన్లో గురువారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న, సీపీఐఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రామాచారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మోదీ రాకను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
భూపాలపల్లి,కొత్తగూడెంలలో..
భూపాలపల్లి/కొత్తగూడెం సింగరేణి/రామవరం/మణుగూరు టౌన్, నవంబర్ 10 : భూపాలపల్లి ఏరియా గనులు, డిపార్ట్మెంట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేటీకే-6వ గని వద్ద జరిగిన నిరసనలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి పాల్గొన్నారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ శుక్రవారం గోదావరిఖనిలో జరిగే భారీ ర్యాలీకి కార్మిక సోదరులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేట్ ప్రధాన కార్యాలయం, మెయిన్ దవాఖాన, ఎస్అండ్పీసీ విభాగం, సెంట్రల్ వర్క్‌షాప్, మెయిన్ వర్క్‌షాప్, సివిల్ డిపార్ట్మెంట్లలో మోదీ పర్యటనను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జీకేవోసీలో బొగ్గుగని కార్మిక సంఘం 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ అధ్యక్షతన నిరసన తెలిపారు. మణుగూరులోని గనులు, డిపార్ట్మెంట్లలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.