కుంటాల, నవంబర్ 10 : ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలం ఓల, లింగా (కే) గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఓలలో డీసీఎంఎస్, లింబా (కే) లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ప్రారంభించారు. భైంసా మండలం వానల్పాడ్ నుంచి లింబా, కుంటాల మీదుగా వంజర్ రహదారి మరమ్మతులకు రూ. 1.09 కోట్లు మంజూరుకాగా ఆ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు.రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. వంజర్- వానల్పాడ్ రోడ్డు నిర్మాణంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ గెలుపొందడంతో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఖనీష్ ఫాతిమా, ఆనంద్ రావు, కుసుమల ముత్యం రెడ్డి, ఎంపీపీ గజ్జా రాం, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ గిరీశ్, కొత్తపల్లి బుచ్చన్న, శ్రీకర్ రెడ్డి, హైమద్ పాషా, వెంకటేశ్, సదాశివ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్‌తో లాభాలు
రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఓలలో శంకర్ గౌడ్ తోటలో ఆయిల్ పామ్ మొక్క నాటారు. ఆయిల్ పామ్‌తో రైతులు లాభాలు గడించవచ్చునని చెప్పారు.
పాఠశాల పరిశీలన
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగం గా లింబా (కే) ఓల గ్రామంలో కొనసాగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
లింబా (కే) గ్రామానికి చెందిన అమ్మాయి ఇటీవల మృతి చెందగా, ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరామర్శించారు. అమ్మాయి మృతికి గల కారణాలను కుమారులు జలపతి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
దళారులను నమ్మి మోస పోవద్దు
బాసర, నవంబర్ 10 : రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నా రు. బాసరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ దయాల లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు శ్యామ్, వార్డు సభ్యులు కార్యకర్తలున్నారు.