ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, ఫిబ్రవరి 28 : ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ ఓటరు అవగాహన పోటీలకు సంబంధించి ‘నా ఓటే నా భవిష్యత్-ఒక్క ఓటుకున్న శక్తి’ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో ఎస్ భీమ్ కుమార్, డీబీసీడీవో రజలింగు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, శ్రీవాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.