తాంసి, ఫిబ్రవరి 28 : నేటి మహాశివరాత్రి వేడుకలకు తాంసిలోని శ్రీ రామలింగేశ్వరాలయం, వడ్డాడిలోని లింబాద్రి నర్సింహాస్వామి, పొన్నారిలోని మార్కండేయ, శ్రీ లక్ష్మీనరసింహా స్వామి, శివాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో తళుక్కుమంటున్నాయి. భక్తుల దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బజార్హత్నూర్లో మహాదేవుని ఆలయం
బజార్హత్నూర్, ఫిబ్రవరి 28 : మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయం ముస్తాబైంది. కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
కోటిలింగాల గుడి ..
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 28 : ఆదిలాబాద్ మండలం శివఘాట్-కుంభజరి గ్రామాల శివారులోని కోటిలింగాల శివుని ఆలయం ముస్తాబైంది. పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నందున గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. మర్రిచెట్టు కింద స్వయంభూ గా వెలసిన ఈ శివలింగాలకు 500 ఏళ్ల చరిత్ర ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి ఈ క్షేత్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.