బేల, అక్టోబర్ 29 : ఆకుకూరలంటే తొలుత గుర్తుకు వచ్చేవి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గ్రామాలే. గతంలో పత్తి, సోయా, కంది తదితర పంటలే ఇక్కడ కనిపించేవి. కాలం కాలిసి రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంతమంది రైతుల దృష్టి కూరగాయాల వైపు మళ్లింది. తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశాలుండడంతో మిగతా రైతులూ ఈ బాటనే అనుసరించారు. టమాట, కాకర, బెండ, బబ్బెర, బీర, సోర, చిక్కుడు, పుదీన, మెంతి, పాలకూర, తోటకూర, ఉల్లిగడ్డలు పండిస్తున్నారు. జూనోని, టాక్లీ, సోన్ఖాస్, మసాల(బీ)లోని చాలా కుటుంబాలు కేవలం వీటి సాగు పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. దిగుబడి ఎక్కువ వస్తుండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
వారసంతల్లో అమ్మకాలు
బేల మండల కేంద్రంలో ప్రతి బుధవారం వార సంత ఉంటుంది. మండలంలోని ప్రజలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారు. రైతులు కూరగాయలను ఇక్కడే అమ్మడానికి తీసుకొస్తారు. తాజాగా ఉండడంతో ప్రజలు వారానికి సరిపోయే కూరగాయాలు ఇక్కడే కొనుగోలు చేస్తారు. బేల మినహా మండలంలో ఎక్కడా మార్కెట్ సదుపాయం లేదు. రవాణా ఖర్చులు పోగా నెలకు రూ. 20 వేల పైగా ఆదాయం మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. సంతలోనే కాకుండా బేల మండలంతోపాటు పక్క మండలాలకు కూడా ద్విచక్ర వాహనాలపై వెళ్లి కూరగాయాలు అమ్ముతున్నారు.
సేంద్రియ ఎరువుల వినియోగం …
పశువుల పేడ, గో మూత్రంతో సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని కూరగాయలు పండించడంలో ఈ రైతులు దిట్ట. పశువుల పేడ, మూత్రంతోపాటు సీతాఫలాల ఆకులు, వేపాకు చూర్ణం చేసి కషాయం తయారు చేసి పిచికారీ చేస్తారు. దీని వల్ల చీడపీడలు ఆశించకుండా ఉంటాయని చెబుతున్నారు. రసాయన ఎరువులకు ఖర్చు ఎక్కువగా ఉండడం వల్లే ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు.
ముందుచూపుతో లాభాలు..
సోన్ఖాస్ గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు ఐదెకరాల భూమి ఉంది. ఇందులో మూడెకరాల్లో రకారకాల కూరగాయాల సాగు చేస్తున్నాడు. సాధారణ పంటలతో పాటు ఇతర రైతులకు భిన్నంగా సాగు చేసి లబ్ధి పొందుతున్నాడు. 11 ఏళ్లుగా ఈయన కూరగాయాల సాగును కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బిందు సేద్యం ద్వారా మిర్చి, వంకాయ, టమాట, బెండ, కాకరకాయ తదితర కూరగాయలు పండిస్తున్నాడు. బేల మండల కేంద్రంలోని వార సంతలో అమ్మి మంచి లాభాలు పొందుతున్నాడు.
గోబి సాగులో దిట్ట నాగోసే..
బేల మండలంలోని జూనోని గ్రామానికి చెందిన మారుతి నాగోసే గోబి సాగులో దిట్ట. తనకున్న 2 ఎకరాల్లో 20 గుంటలు గోబి సాగు చేస్తున్నాడు. మిగతా వాటిలో బెండ, టమాట, మిర్చి, పాలకూర, మెంతికూర, బీరకాయ, చిక్కుడు కాయ, కాకరకాయ పంటలు వేస్తాడు. ఈయన గత పదేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఏ కాలంలోనైనా ఆకుకూరల సాగు చేయడంలో ఆయన దిట్ట. ప్రతి వారం వారసంతలో అమ్మి లాభాలు పొందుతాడు.
రెండెకరాల్లో కూరగాయలే..
బేల మండలంలోని సోన్ఖాస్కు చెందిన రైతు పేరు నాగోసే సుధాకర్. రకరకాల కూరగాయాల సాగు చేస్తారు. పొలంలో బోరునీరు, విద్యుత్ సౌకర్యం ఉండడంతో తనకున్న నాలుగెకరాల్లో 2 ఎకరాల్లో కూరగాయాలు వేశాడు. మిగతా భూమిలో సోయా, పత్తి, కంది సాగు చేశాడు. టమాట, బెండ, మిరప, వంకాయ, చిక్కుడుకాయ సాగు చేస్తున్నాడు. ప్రతి బుధవారం బేల వార సంతకు వెళ్లి స్వయంగా అమ్ముతా. ఇలా వారానికి ఖర్చులు పోనూ రూ.5 వేల ఆదాయం వస్తున్నది. – సుధాకర్, రైతు