‘తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అని చెప్పిన సీఎం కేసీఆర్, అదే సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించగా, కోట్లాది మొక్కలకు ప్రాణం పోస్తున్నది. ఇప్పటికే ఏడు విడుతలను విజయవం తంగా పూర్తి చేసిన యంత్రాంగం, ఎనిమిదో విడుతలోనూ అదే జోరు కొనసాగించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1.81 కోట్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, మూడు నెలల్లోనే 1.98 కోట్లు నాటి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు 100 శాతానికి పైగా పూర్తి చేయగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 86.64 శాతంతో ముందుకెళ్తున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో సత్ఫలితాలు వస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఏడు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి పల్లెలు, పట్టణాలు పచ్చగా మారిపోయాయి. ఇక ఈ ఏడాది ఎనిమిదో విడుత కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.81 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో 1.98 కోట్ల మొక్కలు నాటడం పూర్తయ్యింది. అటవీశాఖ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ శాఖలు తమకు ఇచ్చిన టార్గెట్‌కు మించి మొక్కలు నాటాయి.
కలిసి వచ్చిన వాతావరణం..
ఈ ఏడాది జూన్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు. వర్షాలు ఆలస్యమవుతాయనే వాతావరణ శాఖ సూచనల మేరకు జూలై 7న ఎనిమిదో విడుత చేపట్టారు. వాతావరణం అనుకూలించడం, విస్తారంగా వర్షాలు కురియడం కలిసివచ్చింది. దీంతో కేవలం మూడు నెలల్లోనే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి మొక్కలు నాటడం సాధ్యపడింది. అన్ని ప్రభుత్వశాఖలు ఉద్యమ స్ఫూర్తితో లక్ష్యానికి మించి మొక్కలు నాటాయి. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు అత్యధిక మొక్కలు నాటి హరితహారం విజయవంతం కావడంలో కీలక భూమిక పోషించాయి. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించడం, మొక్కలు పంపిణీ చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అందరూ ఎక్కడికక్కడ హరితోద్యమంలో పాల్గొనడం కలిసి వచ్చింది.
జిల్లాల వారీగా జియోట్యాగింగ్..
ఆదిలాబాద్ జిల్లాలో 39.51 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.9 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 53.19 లక్షలు, నిర్మల్ జిల్లాలో 45.74 లక్షల మొక్కలకు జియోట్యాగింగ్ పూర్తి చేశారు.
అన్ని శాఖల సంపూర్ణ సహకారంతో విజయవంతం
అన్ని శాఖల సంపూర్ణ సహకారం, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో 9.50 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, 26.30 లక్షలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 20 లక్షలకుపైగా మొక్కలు నాటాం. మన జిల్లాలో సింగరేణి కూడా మేజర్ కంట్రిబ్యూషన్ చేసింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇచ్చిన లక్ష్యానికి మించి మొక్కలు నాటాం. వాటి సంరక్షణపై దృష్టి పెడుతున్నాం. జియో ట్యాగింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.
– శివ్ ఆశిష్ సింగ్, డీఎఫ్‌వో, మంచిర్యాల జిల్లా
నాటిన మొక్కలు కాపాడుకోవడం ముఖ్యం
లక్ష్యం మేరకు మొక్కలు నాటాం. టార్గెట్ పూర్తి చేయడం కన్నా మొక్కలను సంరక్షించుకోవడమే ముఖ్యం. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. ఎవెన్యూ ప్లాంటేషన్, స్కూల్ క్యాంపస్‌లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, పార్కుల్లో విస్తారంగా మొక్కలు పెంచాం. లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది.
– శేషాద్రి, డీఆర్డీవో, మంచిర్యాల