గుడిహత్నూర్, ఫిబ్రవరి 11 : గంజాయి రహిత గుడిహత్నూర్ మండలంగా మార్చుకుందామని, ఈ బాధ్యత అందరిపై ఉందని ఎస్ఐ ప్రవీణ్ పేర్కొన్నారు. మండలంలోని శాంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులకు గంజాయి నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత గుట్కా, తంబాకు అమ్మరాదన్నారు. యువత గంజాయి, చెడు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. పంచాయతీలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమల్‌గౌడ్, వార్డు సభ్యులు, యువత, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
చట్టవ్యతిరేకమైన గంజాయి సాగు చేస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. మండలంలోని బోరిగామ గ్రామంలో గ్రామస్తులకు గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించి యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువకులు తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మత్తుకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట అరుంధతి, నాయకులు కుంట సురేందర్ రెడ్డి, నోముల గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, ముత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యువత మాదక ద్రవ్యాలకు బానిసకావొద్దని ఎస్ఐ సీహెచ్ రవికిరణ్ అన్నారు. మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా నివారణకు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.