తాంసి, అక్టోబర్ 22 : ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరం.. కనీస సౌకర్యాలు కరువు.. అదే స్వ రాష్ట్రంలో ఆ పల్లెముఖ చిత్రం మారింది. ఆ గ్రామస్తుల అవస్థలు తీరాయి. ఒకప్పుడు ఒక రోడ్డు కావాలని కోరితే ఇచ్చే నాథుడు లేడు. కానీ ఇప్పుడు కోట్లాది రూపాయలతో దశల వారీగా అభివృద్ధి. పైగా ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం. నాడు పడ్డ అవస్థలు ఇప్పుడు లేనేలేవు. ఆ గ్రామమే తాంసి మండలంలోని ఈదుల్లా సవర్గాం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు తోడు యువకుడైన సర్పంచ్, గ్రామస్తుల ఐకమత్యం కలిసి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఈదుల్ల సవర్గాంలో ప్రజలకు కనీసం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేవు. దీంతో వారు పడ్డ ఇ బ్బందులు అన్నీఇన్నీ కావు. రైతులు చేలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడేవారు. నేడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న ని ధులను అభివృద్ధికి వినియోగించుకుంటూ ప్రతి అంశంలోనూ ముందుకు పోతున్నది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎం పికయ్యే అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నది.
గతంలో ఈదుల్ల సవర్గాం బండలనాగాపూర్ గ్రామపంచాయితీకి అనుబంధ గ్రామంగా ఉండేది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కొత్త పంచాయతీగా ఏర్పడింది. దీంతో ఈదుల్ల సవర్గాం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. దీనికితోడు ఈ గ్రామం మొత్తం హరితవనంలా తయారైంది. యువ సర్పంచ్ మునేశ్వర్ భరత్ గ్రామస్తుల సహకారం, ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలకు ఏది అత్యవసరమో గుర్తిస్తూ వాటిని సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో రూ.60 లక్షలతో అంతర్గత సీసీరోడ్డు, రూ.10 లక్షలతో డ్రైనేజీలు నిర్మించారు. డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, చెత్త సేకరణకు ట్రాక్టర్, ఇంటింటికీ మరుగుదొడ్లు, పల్లె పార్కు, క్రీడామైదానం, పాఠశాలలో అదనపు తరగతి గదులు, రైతులు చేలకు వెళ్లడానికి అవసరమైన మట్టిరోడ్లు, హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల చెట్లు.. ఇలా ఒక్కోటి సమకూరుస్తూ వచ్చారు. దీంతో ఈ గ్రామం ఇప్పుడు హరితవర్ణాన్ని తలపిస్తున్నది.
మాది నూతన గ్రామ పంచాయతీ. యువకుడినన్న నమ్మకంతో మా గ్రామస్తులు సర్పంచ్‌గా అవకాశమిచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నది. పంచాయతీలో అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తి చేయడానికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నా యి. మా గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ పూర్తిగా స హకరిస్తున్నారు. ముఖ్యంగా మా గ్రామస్తులు, మండలాధికారులు సైతం నేను చేసే ప్రతి పనిలో వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. వారిచ్చిన ధైర్యంతోనే మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా.
– మునేశ్వర్ భరత్, సర్పంచ్, ఈదుల్ల సవర్గాం
ఈదుల్ల సవర్గాం నూతనంగా ఏర్పడినప్పటికీ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పంచాయతీ అయినందున గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఏ పని చేయాలన్నా సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటున్నాం. ఇలా చేయడంతోనే ఈ పంచాయతీలో దశల వారీగా అభివృద్ధి సాధ్యమవుతున్నది. భవిష్యత్‌లో కూడా మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాం.
– స్వప్న, పంచాయతీ కార్యదర్శి, ఈదుల్ల సవర్గాం