మంచిర్యాల, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : .. ఇలా ఈ ఇద్దరే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా మోసపోయి ఉంటారని బాధితులు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో మై వీ3 యాడ్స్‌లో దాదాపు 10 లక్షల మంది ఉన్నారని, ఇందులో సగం మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నారని తెలుస్తున్నది. ఇంట్లో కూర్చొని యాడ్స్ చూస్తూ ప్రతి నెలా లక్షల్లో సంపాదించుకోవచ్చని చెబుతారు. వారి ఫోన్లలోని యాప్లోగల వాలెట్లో ఉన్న డబ్బులు, అందులో నుంచి డ్రా చేసుకున్న నగదు వివరాలు చూపిస్తారు. ప్రసెంటేషన్ ఇచ్చి నెలకు రూ.5 లక్షల దాకా వెనుకేసుకోవచ్చని లెక్కలేసి మరీ చూపిస్తారు. మీము మీలాగే వచ్చామని.. ఎన్నో కష్టాలు పడ్డామని, వై వీ3 యాడ్స్‌లో జాయిన్ అయ్యాక లైఫ్‌లో సెటిల్ అయ్యామని.. వారినే ఎగ్జామ్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇవన్నీ నమ్మి ఒక్కసారి పెట్టుబడి పెట్టామా.. సంపాదించడం సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా అటే పోతున్నది.
మై వీ3 యాడ్స్ యాప్ స్కీమ్‌లో రూ.1,20,000 పెట్టుబడి పెట్టాలి. రోజూ యాప్‌లో యాడ్స్ వస్తాయి. ఫోన్లోనే లాగిన్ అయ్యి వచ్చే యాడ్స్ చూడాలి. యాడ్‌కు రూ.5 నుంచి రూ.10, రూ.15 వరకు చెల్లిస్తారు. రోజు ఓ గంట పాటు కూర్చుంటే రూ.430 వస్తాయి. ఈ పని అయ్యాక మీరు రోజూ వారి పని చేసుకోవచ్చు. మీ కింద 8 మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ కింద జాయిన్ అయ్యే ఒక్కో వ్యక్తి మీద రోజుకు రూ.200 చొప్పున మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున రోజుకు రూ.1600, యాడ్స్ చూస్తే వచ్చే రూ.430 మొత్తం 19,030 సంపాదించుకోవచ్చు. అంటే నెలలో రూ.5,70,900 వస్తాయి. ఏడాదికి రూ.68.50 లక్షలు సంపాదించవచ్చు. రెండేళ్లలో మీరు కోట్లు సంపాదిస్తారు. మీరు సంపాదించే ప్రతి వంద రూపాయల్లో పది రూపాయలు టూర్ వ్యాలెట్‌లో జమ అవుతాయి. అలా రూ.50 వేలు అయ్యాక ఆ డబ్బులతో మిమ్ములను టూర్లకు తీసుకెళ్తాం. థాయిలాండ్, గోవాతో పాటు ఇండియాలో టూర్లు ఉంటాయి. మీరు ఏది చూడాలనుకంటే అది చూడొచ్చు. డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
“ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్. ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మంచిర్యాల జిల్లాలో తనకు బాగా తెలిసిన మరో టీచర్ ఈ మై వీ3 యాప్ గురించి వివరించాడు. కొన్నేళ్లుగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నానని.. తన కింద వేలాది మంది జాయిన్ అయ్యారని. గతేడాదే సొంత ఇల్లు కట్టుకున్నానని.. కారు కూడా కొన్నానంటూ చెప్పుకొచ్చాడు. బాగా తెలిసిన వ్యక్తి, పైగా తనతో పని చేసిన టీచర్ కావడంతో శ్రీనివాస్ రూ.1,20,000 పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు యాప్ పని చేయడం లేదు. తనతో డబ్బులు కట్టించిన ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తే సార్ వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నడుస్తుంది. నీ డబ్బులు నీకు ఇస్తారు. కానీ కొన్ని రోజులు ఆగాలంటూ చెప్పాడు. కేస్ ఎందుకైంది. ఇది జన్యూన్ యాప్ అని చెప్పావ్ కదా.. నాకు తెలియదు నువ్వే డబ్బులు ఇవ్వాలంటూ శ్రీనివాస్ గట్టిగా నిలదీయడంతో కాల్ కట్ చేశాడు. ఎన్నిసార్లు చేస్తున్నా ఫోన్ రిసీవ్ చేయడం లేదంటూ శ్రీనివాస్ వాపోతున్నాడు.”
మై వీ3 యాడ్స్ కంపెనీ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంది. హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది. శక్తి ఆనంద్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఏరియాకు ఒక టీమ్ లీడర్ ఉంటారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. అందకే కొన్నేళ్లుగా నడుస్తుంది. ఒకవేళ మా సంస్థ ఫేక్ అయితే ఈ పాటికే మమ్ములను అరెస్టు చేసే వారు కదా.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే పర్మీషన్ ఉంది. ప్రధాని మోదీ సైతం నెట్వర్క్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలని పార్లమెంట్లో మాట్లాడారు. మా సంస్థకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ నమ్మిస్తారు. తమిళనాడుకు తీసుకెళ్లి కోయంబత్తూర్‌లోని కార్యాలయాన్ని సైతం చూపిస్తామంటారు. ఇలా తమిళనాడు కేంద్రంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ దందా నడుస్తున్నది. తెలంగాణలో దాదాపు మూడేళ్లుగా ఇది ఆపరేట్ అవుతుంది. ఇటీవల కొయంబత్తూరు పోలీసులు వై వీ2 యాడ్స్ కంపెనీని స్థాపించిన శక్తి ఆనంద్‌ను, కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేశారు. ఆరు నెలల అనంతరం నెల రోజుల క్రితం వీరంతా బయటికి వచ్చారు. యాప్‌ను పోలీసులు లాక్ చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటికీ నిర్వాహకులు పెట్టుబడి పెట్టిన వ్యక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మార్చి 5వ తేదీన కోర్టులో కేసు హియరింగ్ ఉంది. మనమే కేసు గెలుస్తున్నాం. తిరిగి ప్రారంభిస్తాం. మీ డబ్బులు ఎటూ పోలేదంటూ వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్‌లు పెడుతున్నారు.
“మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన మహేశ్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. సరిగ్గా ఏడాది క్రితం ఓ స్నేహితుడు వచ్చి.. మై వీ3 యాడ్స్ యాప్‌లో వాళ్లు పంపించే యాడ్స్ చూస్తే రోజూ రూ.430 ఇస్తున్నారు. ఇంట్లో ఉండే గత నెలలో నేను రూ.12,900 సంపాదించాను. నువ్వు కూడా జాయిన్ అవ్వు అన్నాడు. ఓ వ్యక్తిని తీసుకువచ్చి పరిచయం కూడా చేశాడు. ఇలా రోజుకు రూ.430 రావాలంటే ముందు రూ.1.20,000 పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఎవరినైనా జాయిన్ చేపిస్తే వారి పేరుపైనా రోజూ రూ.200లు అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి నమ్మించారు. యాప్ చూపించి, దాని నుంచి డ్రా చేసుకున్న డబ్బుల వివరాలను చూపించడంతో మహేశ్ నిజమే అనుకున్నాడు. భార్య నగలు కుదువపెట్టి రూ.1.20,000 యాప్‌లో పెట్టాడు. తనతో పాటు తన తమ్ముడిని కూడా మరో రూ.1.20,000 పెట్టి జాయిన్ చేయించాడు. వాళ్లు పంపించే యాడ్స్ చూస్తుంటే రోజూ.430 వాలెట్లో యాడ్ అవుతూ వచ్చాయి. ఉన్నఫలంగా ఓ రోజు యాప్ ఓపెన్ కాలేదు. ఆరా తీస్తే నిర్వాహకులను అరెస్టు చేశారు. కొన్ని రోజుల సమయం పడుతుంది అంటూ తనను జాయిన్ చేసిన వ్యక్తి బాంబ్ పేల్చాడు. దీంతో మహేశ్ తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకొని లబోదిబో మంటున్నాడు.”
ఇంట్లో కూర్చొని యాడ్స్ చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చని వచ్చే వారిని నమ్మకండి. అది మోసమేనని గ్రహించండి. ఊరికే డబ్బులు ఎవ్వరూ ఇవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్ మార్కెటింగ్‌లకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదు. ఇలాంటి యాప్‌లను ఎవరూ నమ్మొద్దు. ఎవరైనా వచ్చి సంప్రదిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఈజీ ఎర్నింగ్ యాప్‌లను నమ్మి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. – ఎం.శ్రీనివాస్, రామగుండం సీపీ