మంచిర్యాల, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్‌లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖకు రూ.22,615 కోట్లు ప్రతిపాదించగా, జిల్లాకు మాత్రం అత్యల్పంగా నిధులు కేటాయించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పున:రుద్ధరిస్తామని హడావుడి చేసిన సర్కారు, ఈ బడ్జెట్లో ఆ ప్రాజెక్ట్‌కు కేవలం రూ.52.62 కోట్లే ఇచ్చింది. రూ.1068.93 కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పి, సర్వేలు సైతం చేయించింది. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల దాకా నీటి తరలింపుపై ఇటీవలే ఓ కన్సల్టెన్సీ సర్వేను పూర్తి చేసి అలైన్మెంట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టనున్నారని ప్రచారం జరిగింది. కానీ, నిధులు కేటాయించకపోవడంతో ప్రాణహిత ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందన్న చర్చ జోరందుకున్నది.
తుమ్మిడిహెట్టి సమీపంలో ప్రాణహితపై తగినంత నీటి లభ్యత లేకపోవడంతో పాటు మహారాష్ట్రలో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నందున ప్రాణహితను కట్టడం సాధ్యం కాదని.. గతంలోనే బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. తాజాగా.. కాంగ్రెస్ సర్కారు చేయించిన సర్వేలోనూ ఇదే విషయం తేలిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో సర్కారు నిధులు కేటాయించకపోవడంతో ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం ఉన్నట్టా.. లేనట్టా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కలుపుకొని మంచిర్యాల సీఈ పరిధిలో ఏడు ప్రాజెక్ట్‌లు ఉండగా, ప్రాణహితకు నిధుల కేటాయింపులు జరగలేదు. మంచిర్యాల రాళ్లవాగులో కరకట్ట నిర్మాణానికి, గొల్లవాగు ప్రాజెక్ట్, నీల్వాయి ప్రాజెక్ట్, వట్టివాగు, కుమ్రం భీం, పీపీరావు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులకు రూ.1471 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపితే.. కేవలం రూ.207 కోట్లే కేటాయించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి ప్రాజెక్ట్‌గా చనాక-కొరాట ప్రాజెక్ట్‌ను 2015లో రూ.368 కోట్ల వ్యయంతో కేసీఆర్ సర్కారు మొదలుపెట్టింది. భీంపూర్, జైనథ్, ఆదిలాబాద్, బేల మండలాల్లో 51 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా.. పనులు మొదలుపెట్టింది. అనేక అడ్డంకులు, ఒడిదొడుకులను ఎదుర్కొని అంచనా వ్యయం రూ.1220 కోట్లకు పెరిగినా.. ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు బ్యారేజీకి అనుసంధానంగా కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
భీంపూర్ మండలం పిప్పల్‌కోటీ సమీపంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉండగా, కేవలం 200 ఎకరాలు సేకరించారు. 13 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఎడమ కాలువతో అనుసంధానం చేసే పిల్ల కాలువల కోసం వెయ్యి ఎకరాల భూ సేకరణ ఇప్పటికీ చేయలేదు. ఫలితంగా బ్యారేజీలో నీళ్లు ఉన్నా, సాగు నీరు పొలాలకు అందించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పనులు చేయించాల్సిన సర్కారు గడిచిన రెండు,మూడేళ్లుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతేడాది బడ్జెట్లో రూ.177.05 కోట్లు కేటాయించి, చివరకు రూ.34 కోట్లు విడుదల చేసింది. ఈ సారి బడ్జెట్లోనూ.రూ.177.54 కోట్లు కేటాయించింది.
వందల కోట్లు కేటాయించినట్లు చెప్పడం, కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ సారైనా ఈ ప్రాజెక్ట్ పనులకు మోక్షం దక్కుతుందనుకుంటే అతీగతీ లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. ఆదిలాబాద్ సీఈ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఏడు ప్రాజెక్ట్‌లు ఉండగా, వీటిలో కీలకమైన చనాక-కొరాటకు ఆశించిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్ట్ పరిధిలో కాల్వల నిర్మాణం అవసరం లేకుండా తుంపర్ల సేద్యం చేసుకునేలా గత ప్రభుత్వం 90 శాతం పనులను పూర్తి చేయగా, మిగిలిన పనులకు రూ.4.62 కోట్లు కేటాయించారు.
వీటితో పాటు త్రివేణి సంగమం, పులిమగుడు, కుప్టి ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణ, ప్రాజెక్ట్ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అసలు సర్కారు పరిగణలోకే తీసుకోలేదు. కడెం ప్రాజెక్ట్‌కు రూ.3.78, సాత్నాలకు రూ.1, మత్తడివాగుకు రూ.4.62, గడ్డెన్నవాగుకు రూ.1.52, చిక్మన్ వాగుకు రూ.1.81 కోట్లు, త్రివేణి సంగమానికి రూ.1.78 కోట్లు అరకొరగా కేటాయించిన కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్ట్‌కు మొండిచేయి చూపించింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం, సాగునీరు అందించే నీటిపారుదల ప్రాజెక్ట్‌లను చిన్నచూపు చూస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
