స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పదమూడో రోజైన శనివారం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు తరలివచ్చి దేశభక్తిని తలపించేలా రంగవల్లులు వేశారు. భరతమాత, భారతదేశ పటం, జై జవాన్.. జై కిసాన్.. ఐ లవ్ ఇండియా.. మువ్వన్నెల జెండాల నమూనాల ముగ్గులు వేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ సంఘ భవనంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా.. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పాల్గొని బహుమతులు అందజేశారు.
ఆదిలాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని స్టేడియంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో మహిళలు తరలిరాగా.. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.
బోథ్ మండలంలోని వివిధ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేశారు. ఇచ్చోడ మండల సమాఖ్య(ఐకేపీ) ఆధ్వర్యంలో జడ్పీ సెకండరీ పాఠశాల ఆవరణలో యువతులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ సంఘ భవనంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రంగోళి నిర్వహించారు.
పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో భారీ సంఖ్యలో యువతులు, విద్యార్థులు, చిన్నారులు, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించే రంగవల్లులు వేశారు. వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా సంప్రదాయ ముగ్గులు వేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు బహుమతులు ప్రదానం చేశారు.