జైనథ్, ఆగస్టు 15: లోకకళ్యాణార్థం గంగమ్మ తల్లికి పాలాభిషేకం చేశామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం డొల్లరా గ్రామ సమీపంలో కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో సోమవారం గంగమ్మ విగ్రహానికి పూజలు చేసి 5వేల లీటర్లతో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచభూతాల కలయికతో నిర్మితమైన భారతదేశంలో లోకకళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. గంగనది పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఆపదలు జరగవద్దన్న ఉద్దేశంతో ఇలాంటి దైనందిక కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిషన్జీ మహారాజ్, భక్తులు పాల్గొన్నారు.