రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గిరివికాసం’ నిరుపేద రైతులకు వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరు చేయగా, 100 శాతం రాయితీపై విద్యుత్ సౌకర్యంతో పాటు బోర్లు వేసి పంటలకు నీరందేలా వసతులు కల్పిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,591 దరఖాస్తులు రాగా, భూగర్భ జలశాఖ సర్వే నిర్వహించి ఇప్పటికే 119 మందికి యూనిట్లు మంజూరు చేసింది. వర్షాధారంపైనే ఆధారపడి వ్యవసాయం చేసే వారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ మేరకు గిరి వికా సం పథకం ద్వారా రూ. 6 కోట్లు మంజూరు చేసింది. 100 శాతం రాయితీపై గిరిజన రైతులకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పా టు బోర్లు వేసి సాగునీటిని అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెరువు, బోర్ల ద్వారా అత్యధికమంది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక కొందరు గిరిజన రైతులు తమ భూముల్లో బోర్లు వేసుకునే స్థోమత లేక, కేవలం వర్షాధారంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇ లాంటి రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు బోర్లు వేయడం, మోటార్లు ఇవ్వ డం, ఇంకా సాగునీటికి అవసరమైన అన్ని వసతులను ఈ పథకం ద్వారా ఉచితంగా కల్పిస్తారు.
వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ఆదిమ గిరిజనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1591 మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారు. 295 మంది రైతుల భూములను భూగర్భ జలశాఖ అధికారులు సర్వే చేశారు. ఇందులో 119 మందికి యూనిట్లు మం జూరు చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ. 3.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పదెకరాలకో యూనిట్‌ను అమలు చేస్తున్నారు. ఐదెకరాలు కలిగిన ఇద్దరు రైతులు లేక అంతకంటే తక్కువ భూమి కలిగిన ఇద్దరు లేక ముగ్గురు రైతులు పక్కపక్కన ఉన్నవారిని కలిపి ఒక యూనిట్‌ను అమ లు చేస్తున్నారు. గతంలో ఐడీటీఏ ద్వారా గిరిజన రైతుల భూముల్లో తవ్వి వదిలేసిన బావులను కూడా గిరి వికాసం ద్వారా వినియోగంలోకి తీసుకువస్తున్నారు. నిమ్నజాతికి చెందిన కొలాం, మన్నేవార్, తోటి గిరిజనులకు ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఆదిమ గిరిజనులను వ్యవసాయం లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అ మలు చేస్తున్నది. దీని ద్వారా జిల్లాలోని గిరిజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.
మా చేనుకు ఉచింతగా సాగునీటి వసతి కల్పించడం సంతోషంగా ఉంది. గిరి వికాసం ద్వారా మాకు పూర్తిగా ఉచితంగా సాగు నీటి వసతి కల్పించారు. మాకున్న ఐదెకరాల్లో ఇక నుంచి కూరగాయలు సాగు చేస్తాము. ఇప్పుడు వర్షాకాలంలో పత్తి, కంది వేశాం. ఈ పంటలు తీసిన తర్వాత బోరు నీటితో కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తాం. ఉచితంగా సాగు నీటి వసతి కల్పించినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బానోత్ యమునా బాయి, సోమల గూడ, కెరమెరి మండలం
మాకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇంత కాలం సాగునీటి వసతి లేకపోవడంతో పంటలు సరిగా పండించలేకపోయినం. గిరి వికాసం పథకం కింద సర్కారు రూ.3 లక్షలతో ఇటీవల ఉచితంగా బోరు వేయించింది. కరెంటు సౌకర్యం కూడా కల్పించింది. మా చేనుకు నీటి సౌకర్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మేము పూర్తిస్థాయిలో పంటలు పండిస్తం.
– అజ్మీర కవిత, సోమల గూడ, కెరమెరి మండలం