ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్.. బాలకార్మికులను వెట్టి నుంచి విముక్తులను చేస్తున్నాయి. అక్షర జ్ఞానానికి దూరమైన వారు బడిబాట పట్టేలా చైతన్యం కల్పిస్తున్నాయి. చిన్నారుల మోముల్లో చిరునవ్వులను పూయిస్తున్నాయి. తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఏటా ప్రభుత్వం చేపడుతున్నవి సత్ఫలితాలనిస్తున్నాయి.
పోలీసు,శిశు సంక్షేమ, బాలల సంరక్షణ కమిటీలు కార్యక్రమం విజయవంతంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,660 మందికి, ఆపరేషన్ స్మైల్ ద్వారా 3,715 చిన్నారులకు విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుండగా బాలబాలికలను గుర్తిస్తున్నారు. కాగా.. ఎవరైనా పనిలో పెట్టుకుంటే 1098కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
నిర్మల్(నమస్తే తెలంగాణ)/ ఎదులాపురం, జూలై 30 : బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు 2015 నుంచి ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. యేటా జనవరి 1 నుంచి 30 రోజులపాటు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 30 రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
బాలకార్మికులు, భిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను అనాథాశ్రమాలకు పంపించడం, చదువుకు దూరమైన వారిని తిరిగి బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ల సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో బాలకార్మికులు కనిపిస్తే ఆయా యజమానులపై బాలకార్మిక నిషేధచట్టం, వెట్టిచాకిరీ నిరోధక చట్టాలనుఅనుసరించి కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీలు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట ఏడు విడుతల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో 731, నిర్మల్లో 538, మంచిర్యాలలో 1132, ఆసిఫాబాద్లో 259 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఆపరేషన్ స్మైల్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో 955, నిర్మల్ 890, మంచిర్యాలలో 1334, ఆసిఫాబాద్ 536 మందిని చేరదీశారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా గుర్తించిన వారి వివరాలను ట్రాక్ చైల్డ్ పోర్టల్లో పొందుపర్చి తప్పిపోయిన వారి చిన్నారుల ఆచూకీని కూడా కనుగొంటున్నారు.
యేటా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ శాఖలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పోలీస్, మహిళా శిశు సంక్షేమం, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలు, బాలల సంరక్షణ కమిటీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. స్పెషల్ టీంలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బాలకార్మికుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, ఇసుక బట్టీలు, హోటళ్ల వంటి చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి చిన్నారులను వెట్టి నుంచి విముక్తి కల్పిస్తుండడంతో చదువుకు దూరమైన వారంతా తిరిగి విద్యావంతులవుతున్నారు.
బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలి. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటాం. యేటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలబాలికలకు విముక్తి కల్పిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఎక్కడైనా బాలకార్మికులు కన్పిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి వెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన వారిపై కేసులు కూడా నమోదు చేయిస్తున్నాం.