ఎదులాపురం, జూలై 30 : ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలు, బస్తీ దవాఖాన, సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్, డంపింగ్ యార్డ్ తదితర పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
స్థానిక కేఆర్కే కాలనీలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖాన నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. స్థానిక సాత్నాల క్వార్టర్స్‌లో నిర్మిస్తున్న సమీకృత నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయా పనులను దసరా నాటికి పూర్తి చేయాలన్నారు. అనంతరం అంబేద్కర్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించి మల్టీ లేయర్ పద్ధతిలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. బంగారు గూడలోని డంపింగ్ యార్డును సందర్శించి సెగ్రిగేషన్, వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఏఈ అరుణ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.