ఆదిలాబాద్ రూరల్, జూలై 30 : బీజేపీ నాయకులు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో రూ.60లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఎటువంటి హామీలు ఇవ్వకుండా బీజేపీ నాయకులు భరోసా యాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీ అరవింద్ ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన వారికి జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలని సవాల్ విసిరారు.
కేంద్రం పరిధిలోని సీసీఐ పునరుద్ధరణపై ఆ పార్టీ నేతలు ఎటువంటి భరోసా కల్పించలేదని, కేంద్రీయ విద్యాలయానికి పది ఎకరాల స్థలం కేటాయించినా కేంద్రప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకుల మోస పూరిత మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయలతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీశ్, వెంకన్న, రాంకుమార్, ధమ్మపాల్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ పాల్గొన్నారు.